ఇంట్లో సహాయం కోసం తీసుకెళ్లి.. బాలికపై ఆర్మీ మేజర్ దంపతుల పైశాచికం.. ఆహారం పెట్టకుండా, నగ్నంగా ఉంచుతూ..
ఇంటిపనుల్లో సహాయం కోసం తీసుకెళ్లిన బాలిక మీద ఆర్మీ మేజర్ అతని భార్య దాష్టీకానికి పాల్పడ్డారు. తిండి పెట్టకుండా, కొడుతూ, వాతలు పెడుతూ, హింసిస్తూ... వికృతంగా ప్రవర్తించారు.
అస్సాం : అస్సాంలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దేశరక్షణబాధ్యతలు నిర్వర్తించే ఓ ఆర్మీ మేజర్ తనింట్లో పనిచేసే చిన్నారిపై పాశవికంగా ప్రవర్తించాడు. అస్సాంలోని డిమా హసావో జిల్లాలో తమ ఇంటి పనిమనిషిని చిత్రహింసలకు గురిచేసినందుకు ఆర్మీ మేజర్, అతని భార్యను అరెస్టు చేసినట్లు ఉన్నత పోలీసు అధికారి మంగళవారం తెలిపారు.
బాలికపై మేజర్ దంపతులిద్దరూ వికృతచేష్టలకు పాల్పడ్డారు. బాలిక శరీరంమీద ఎక్కడ చూసినా కాల్చిన వాతలే కనిపించాయి. ముక్కు, నాలుక భాగాల్లో బలమైన దెబ్బలున్నాయి. పళ్లు ఊడిపోయాయి. అంతేకాదు మరో దారుణమై విషయం ఏంటంటే.. పనిమనిషైన ఆ బాలికను దాదాపుగా నగ్నంగా ఉంచుతున్నారు. ఈ మేరకు పోలీసులు తెలిపారు.
6 రాష్ట్రాలు, 51 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ దాడులు.. ఎందుకంటే ?
హిమాచల్ ప్రదేశ్‌లోని పాలంపూర్‌కు ఈ దంపతులు వచ్చినప్పుడు వారితో పాటు మైనర్ బాలిక వచ్చింది. ఆమెను "పాశవికంగా హింసించారని" తమకు ఆదివారం సమాచారం అందిందని డిమా హసావో ఎస్పీ మయాంక్ కుమార్ తెలిపారు.భారతీయ శిక్షాస్మృతి, ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టం, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద హఫ్లాంగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు కుమార్ తెలిపారు.
"విచారణలో, ఆర్మీ మేజర్, అతని భార్యపై ప్రాథమిక సాక్ష్యం కనుగొనబడింది. ఈ కేసుకు సంబంధించి వారిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు" అని ఎస్పీ చెప్పారు. బాలికకు వైద్యం సహా అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని ఆయన తెలిపారు. “మరింత విచారణ జరుగుతోంది. దర్యాప్తు ఫలితాల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటాం' అని కుమార్ తెలిపారు.
ఈ దంపతులు ఇంట్లో పనుల కోసం ఆ బాలికను తనతో పాటు తీసుకెళ్లి... గత ఆర్నెళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నారు. తిండికూడా సరిగా పెట్టడం లేదు. దీంతో బాలిక బక్కచిక్కిపోయింది. ఆకలి తట్టుకోలేక చెత్తకుప్పలోనుంచి ఆహారం ఏరుకుని తినేలా చేసి.. దంపతులు పైశాచికానందం పొందేవారని పోలీసులు తెలిపారు.
నిందితుడు ఆర్మీ మేజర్ గా పనిచేస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం విధుల్లో ఉన్నాడు. అసోం నుంచి హిమాచల్ ప్రదేశ్ వెళ్లేప్పుడు ఇంట్లో పనుల కోసం బాలికను తమతో తీసుకెళ్లారు. తిరిగి అసోం వచ్చినప్పుడు బాలిక తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పడంతో వెలుగు చూసింది.