Asianet News TeluguAsianet News Telugu

మా సహనాన్ని పరీక్షించొద్దు: చైనా, పాక్‌లకు ఆర్మీ చీఫ్ హెచ్చరిక

గతేడాది గాల్వన్‌ ఘటనలో అమరులైన 20 మంది భారత సైనికుల త్యాగాలు ఎన్నటికీ వృథా కావన్నారు భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె . శత్రువులు తమ బలాన్ని తక్కువ అంచనా వేయకూడదని.. భారత సైన్యం సహనాన్ని పరీక్షించడానికి ఎవ్వరూ ప్రయత్నించొద్దని హెచ్చరించారు. 

army day 2021 indian army chief gen naravane warns china and pakistan ksp
Author
New Delhi, First Published Jan 15, 2021, 4:39 PM IST

గతేడాది గాల్వన్‌ ఘటనలో అమరులైన 20 మంది భారత సైనికుల త్యాగాలు ఎన్నటికీ వృథా కావన్నారు భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె . శత్రువులు తమ బలాన్ని తక్కువ అంచనా వేయకూడదని.. భారత సైన్యం సహనాన్ని పరీక్షించడానికి ఎవ్వరూ ప్రయత్నించొద్దని హెచ్చరించారు.

ఆర్మీ డే సందర్భంగా దిల్లీ కరియప్ప మైదానంలో జరిగిన కార్యక్రమంలో చీఫ్ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌..జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నరవణె మాట్లాడుతూ.. సరిహద్దుల్లో యథాతథస్థితిని మార్చేందుకు చైనా యత్నించిందని.. ఈ సమయంలో చైనాకు భారత సైన్యం దీటుగా సమాధానమిచ్చిందన్నారు. 

గత సంవత్సరం భారత సైన్యానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని.. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇప్పటివరకు ఎనిమిది రౌండ్లలో జరిగిన చర్చల వల్ల సైనికుల్లో భద్రతను కల్పించామని తెలియజేశారు.

మరోవైపు నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం దాదాపు 40 శాతం పెరిగిందన్నారు. అయితే, గతేడాది నియంత్రణరేఖ వద్ద 200లకు పైగా ఉగ్రవాదులను హతమార్చామని నరవణె గుర్తుచేశారు. ఇక సైన్యం బలోపేతం కోసం రూ.5వేల కోట్ల విలువైన ఆయుధాల కోసం ఒప్పందం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.  

ఇక గత ఏడాది గల్వాన్‌ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో 20మంది భారత్‌ సైనికులు అమరులయ్యారు. అయితే, ఆ ఘటనలో ఎంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారనే వివరాలను చైనా ఇప్పటి వరకూ ప్రకటించలేదు. దాదాపు ఏడు నెలల కింద జరిగిన ఈ ఘటనతో అక్కడ ఇప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.

ఈశాన్య రాష్ట్రాలు:

ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతా ప్రమాణాలు చాలా మెరుగుపడ్డాయన్న నరవణె .. భారత సైన్యం చురుకైన కార్యకలాపాలతో, 600 మందికి పైగా ఉగ్రవాదులు లొంగిపోయారని తెలిపారు. ఇదే సమయంలో ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు , మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మయన్మార్ సైన్యం సహాయంతో నిర్వహిస్తున్న కార్యకలాపాలు సత్ఫలితాలను సాధిస్తున్నట్లు నరవణె ప్రకటించారు. 

భారత సైన్యం ఆధునీకరణ:

21వ శతాబ్దంలో సవాళ్లను ఎదుర్కోవటానికి యుద్ధ-పోరాట సామర్థ్యాలను పెంచడానికి తాము నిరంతరం ఆధునీకరణ, పునర్వ్యవస్థీకరణ వైపు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అత్యవసర, ఫాస్ట్ ట్రాక్ పథకాల కింద రూ .5 వేల కోట్ల విలువైన ఆయుధాలు , మందుగుండు సామగ్రిని సేకరించామని నరవణె తెలిపారు. ఈ ఏడాది 13,000 కోట్ల రూపాయల ఒప్పందాలు కుదుర్చుకుంటామని ఆర్మీ చీఫ్ చెప్పారు.

టెక్నాలజీ:
ఐఐటిల వంటి ప్రముఖ విద్యా సంస్థల సాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్, క్వాంటం కంప్యూటింగ్, మానవరహిత వ్యవస్థలు, డ్రోన్‌లపై పనులు కొనసాగుతున్నాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత సైన్యం తన ఆధునీకరణ ప్రణాళిక కోసం 32,000 కోట్ల రూపాయల విలువైన 29 ప్రాజెక్టులను గుర్తించింది.

ప్రైవేటు రంగం, ఎంఎస్‌ఎంఇలు, విద్యాసంస్థల మద్దతుతో, భారత సైన్యం .. ఆత్మనిర్బర్ భారత్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇది స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడంలో , దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మిత్రదేశాలకు చెందిన 3 వేలకు పైగా అధికారులు , జవాన్లు .. భారత సైన్యానికి చెందిన శిక్షణా సంస్థలలో ఏడాది పాటు శిక్షణ పొందారు.

ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ:
ప్రపంచవ్యాప్తంగా 8 వేర్వేరు ఐరాస శాంతి పరిరక్షక కార్యకలాపాలలో 5,300 మంది భారతీయ సైనికులు పనిచేస్తున్నారు. కఠినమైన పరిస్ధితుల్లో పనిచేస్తున్న మన జవాన్లు భారతదేశాన్ని గర్వించేలా చేస్తున్నారు.

కోవిడ్ -19
సైన్యం 12 కేంద్రాలను ఏర్పాటు చేసింది. విదేశాల నుండి వచ్చిన భారతీయులను ఈ కేంద్రాల్లో కంటికి రెప్పలా చూసుకుంది. 113 సైనిక ఆసుపత్రులలో, 13,000 పడకలను రక్షణ సిబ్బంది , పౌరుల కోసం అంకితం చేశామని నరవణె పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios