వాళ్లిద్దరూ ఆర్మీ కల్నల్ గా విధులు నిర్వహిస్తున్నారు. మంచి స్నేహితులు కూడా. కాగా.. అలాంటి స్నేహితుడి భార్యపై ఓ ఆర్మీ కల్నల్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా పనిచేస్తున్న ఓ అధికారికి కల్నల్ గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా తోటి కల్నల్ అతనితో పాటు అతని భార్యను విందుకు ఆహ్వానించాడు. కల్నల్ తన స్నేహితుడికి మత్తుమందు కలిపి మద్యం తాగించాడు. అనంతరం తోటి కల్నల్ భార్య అయిన రష్యన్ జాతీయురాలిపై అత్యాచారం చేశాడు. 

బాధిత కల్నల్ తనకు మత్తు మందు ఇచ్చి తన భార్యపై తోటి కల్నల్ అత్యాచారం చేశాడని కాన్పూర్ కంటోన్మెంటు పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. దీంతో తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ రాజ్ కుమార్ అగర్వాల్ చెప్పారు. 

కల్నల్ భార్య ప్రతిఘటించినా ఆమెపై దాడి చేసి అత్యాచారం చేశాడని బాధితురాలి భర్త చెప్పారు. ఐపీసీ సెక్షన్ ప్రకారం ఆర్మీ కల్నల్ పై కేసు నమోదు చేసి అతన్ని పట్టుకోవడానికి పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ అగర్వాల్ చెప్పారు.