కశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. సైనికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. వివరాల్లోకి వెళితే.. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) దళానికి చెందిన సిబ్బంది కశ్మీర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు.

విధులు ముగించుకుని తిరిగి బుద్గామ్ నుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో రాంబన్ జిల్లాలోని ఖునీ నల్లా ప్రాంతం వద్ద జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది.

అయితే అదృష్టవశాత్తూ బస్సు పూర్తిగా లోయలో పడకుండా చెట్లు అడ్డుకున్నాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఒక జవాను మరణించగా, 34 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రికి తరలించారు.