ఎల్వోసీ వెంబడి చొరబాటు యత్నం భగ్నం.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత బలగాలు..
జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారాలోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భద్రత బలగాలు భగ్నం చేశాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారాలోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భద్రత బలగాలు భగ్నం చేశాయి. ఆ సమయంలో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతల బలగాలు మట్టుబెట్టాయి. వివరాలు.. మచల్ సెక్టార్‌లోని కుంకడి ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు నిలువరించాయి. ఆ సమయంలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు కుప్వారా పోలీసులు శనివారం తెలిపారు.
‘‘కుప్వారా పోలీసులు అందించిన ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ ఆధారంగా.. మచల్ సెక్టార్‌లోని కుంకడి ప్రాంతంలో ఆర్మీ, పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు ఇప్పటివరకు హతమయ్యారు. ఆపరేషన్ ఇంకా పురోగతిలో ఉంది’’ జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎక్స్(ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే రైఫిళ్లు, పాకిస్థానీ పిస్టల్‌తో సహా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రూ. 2100 పాకిస్తాన్ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు.