న్యూఢిల్లీ: జమ్మీ - దురంతో ఎక్స్ ప్రెస్ రైల్లోని రెండు బోగీల్లోకి సాయుధులు ప్రవేశించి దోచుకున్నారు. కత్తులు చూపుతూ బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలో గురువారం తెల్లవారు జామున జరిగింది. 

బద్లీ సమీపంలోని క్రాసింగ్ వద్ద రైలు ఆగినప్పుడు గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో దోపిడీ జరిగింది. దోపిడీదారులు బి3, బీ7 కోచ్ లను లక్ష్యం చేసుకుని తన పని కానిచ్చేశారు. 

ప్రయాణికుల నుంచి నగదు,త మొబైల్ ఫోన్లు, ఆభరణాలు, ఎటిఎం కార్డులు దోచుకెళ్లారు. దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు దుండగులు స్వైర విహారం చేశారు. 

ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ సరాయి రోహిల్లా స్టేషన్ ను సమీపిస్తున్న సమయంలో రైల్లో దోపిడీ జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 

నిర్ణీత స్టేషన్లలోనే ఆగే ఈ రైలు తెల్లవారు జామున మూడున్నర గంటల సమయంలో సిగ్నల్ కోసం ఎదురు చూస్తూ అక్కడ ఆగింది. ఈ సమయంలో పది మంది దుండగులు రెండు బోగీల్లోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డారు. ఆ సమయంలో టీటీ గానీ అటెండెంట్ గానీ లేరని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.