Agnipath Recruitment Scheme: కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాల్లో పనిచేసే అవకాశం కల్పించేందుకు అగ్నిపథ్ స్కీమ్‌ను (Agnipath Scheme) ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా అగ్నివీర్లను (Agniveer) నియమించుకోనుంది. వీరు నాలుగేండ్ల పాటు సేవ‌లందిస్తారు. 

Agnipath Recruitment Scheme : కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకాన్ని రూపొందించింది. యువత భార‌తీయ సాయుధ దళాలలో పనిచేయడానికి వీలు క‌ల్పించే రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు కేంద్ర మంత్రివర్గం మంగ‌ళ‌వారం ఆమోదం తెలిపింది. ఈ ప‌థ‌కానికి అగ్నిపథ్ స్కీమ్ (Agnipath Scheme) పేరు పెట్టింది. ఈ పథకం కింద ఎంపిక చేయబడిన యువతను అగ్నివీర్ అని పిలుస్తారు. దేశం ప‌ట్ల భ‌క్తి, ప్రేమ క‌లిగిన యువతను నాలుగు సంవత్సరాల పాటు సాయుధ దళాలలో సేవ చేయడానికి అనుమతిస్తుంది.

ఇండియన్ ఆర్మీ (Indian Army), ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలగాలకు చెందిన అధినేతలు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీగా అగ్నివీర్‌లను (Agniveer) నియమించుకోనుంది. అలాగే.. డిఫెన్స్ బడ్జెట్ వ్య‌యాన్ని తగ్గించుకొని.. మరిన్ని నూత‌న‌ ఆయుధాలు సమకూర్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.

ఈ పథకంలో భాగమైన వారి ప్రయోజనాలు ఏమిటి?

అగ్నిపథ్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మొదట 45,000 మంది అగ్నివీర్‌లను నియమించుకోనుంది. ఈ స్కీమ్ ద్వారా ఎంపికైన వారిని ఇండియన్ ఆర్మీ (Indian Army), ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వీసులలో నియ‌మిస్తారు. వారు నాలుగేళ్లు మాత్రమే పనిచేస్తారు. 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్నవారిని మాత్రమే నియమించుకుంటారు. వారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో పోస్టింగ్ ఇస్తారు.

నాలుగేళ్ల కాల వ్యవధిలో ఆరు నెలల శిక్షణ కాలం కూడా కలిపే ఉంటుంది. అంటే మూడున్నరేళ్లు పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో వారికి నెల‌కు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు స్టైపెండ్ ఇస్తారు. అలాగే.. ప‌లు ర‌కాల అలవెన్సులను కూడా పొంద‌వ‌చ్చు. మెడికల్, ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. నాలుగేళ్లు పూర్తైన తర్వాత వీరిలో కేవ‌లం 25 శాతం మందిని రెగ్యులర్ కేడర్‌లో చేర్చుకుంటారు. వారు 15 ఏళ్ల పాటు నాన్ ఆఫీసర్ ర్యాంక్స్‌లో సేవాలందించాల్సి ఉంటుంది. 

నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత.. ఇక మిగతా 75 శాతం మందికి ఎగ్జిట్ అవకాశం కల్పిస్తారు. ఎగ్జిట్ అయినా.. అగ్ని వీర్లకు రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు సేవా నిధి ప్యాకేజీ, స్కిల్ సర్టిఫికెట్స్ అందిస్తారు. సేవా నిధికి ఆదాయపు పన్ను నుండి మినహాయించ బడుతుంది. ఈ పథకంలో గ్రాట్యుటీ, పెన్షన్ సంబంధిత ప్రయోజనాలు మాత్రం అందుబాటులో ఉండవు. అయితే ఆ తర్వాత మరో కెరీర్‌లో స్థిరపడేందుకు బ్యాంకుల నుంచి రుణాలు లభిస్తాయి. పదవీకాలంలో అగ్నివీర్లకు రూ.48 లక్షల నాన్-కంట్రిబ్యూటరీ జీవిత బీమా కవరేజీ అందించబడుతుంది. ఈ స్కీమ్ ద్వారా డిఫెన్స్ వార్షిక ఖర్చులు బాగా తగ్గిపోతాయి. వార్షిక డిఫెన్స్ బడ్జెట్ రూ.5.2 లక్షల కోట్లకు తగ్గుతుంది.

రిక్రూట్‌మెంట్ ఎలా జరుగుతుంది?

రానున్న 3 నెలల్లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలి బ్యాచ్ 2023 జూలై నాటికి సిద్ధం అవుతుంది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు, నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ స్ట్రక్చర్ వంటి గుర్తింపు పొందిన సాంకేతిక సంస్థలు ఎంపిక చేయ‌నున్నారు. ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. అర్హత వయస్సు 17.5 నుండి 21 సంవత్సరాల మధ్య ఉంటుంది. విద్యార్హతల విషయానికి వస్తే సాయుధ బలగాల్లో రెగ్యులర్‌గా జరిగే నియామకాలకు ఎలాంటి విద్యార్హతలు ఉంటాయో అగ్నివీర్ పోస్టులకు కూడా అవే అర్హతలు ఉంటాయి.