న్యూఢిల్లీ:కరోనా వ్యాక్సిన్ రెండో విడత కార్యక్రమంలో భాగంగా 60 ఏళ్లు పైబడినవారితో పాటు దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్నవారు టీకాలు వేసుకొనే కార్యక్రమం సోమవారం నాడు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ఎయిమ్స్ లో ఇవాళ కరోనా టీకా తీసుకొన్నారు.

ప్రధానికి కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన నర్సులు రోశమ్మ, అనిల్, నివేదా టీకా వేశారు.కరోనాకు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేసేందుకు దేశానికి చెందిన వైద్యులు, శాస్త్రవేత్తలు త్వరితగతిన ఎలా పనిచేశారో చెప్పుకోదగిందన్నారు. 

భారత్ బయోటెక్ టీకా కోవాగ్జిన్ ను ప్రధానికి అందించారు. వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత మోడీ  నర్సులతో మాట్లాడారు. టీకా తీసుకొన్న తర్వాత అప్పుడే పూర్తైందా.. నొప్పి కూడా తెలియలేదు అంటూ ప్రధాని తమతో చెప్పారని నర్సు నివేదా చెప్పారు.

తమ స్వస్థలం ఎక్కడ అనే విషయాలను ప్రధాని తమను అడిగి తెలుసుకొన్నారని ఆమె తెలిపారు. ప్రధాని మోడీ జోకులు వేస్తూ ఆసుపత్రిలో వాతావరణాన్ని తేలికపర్చే ప్రయత్నం చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

రాజకీయ నాయకులు మందపాటి చర్మం గలవారు.. మీరు పశువైద్య ప్రయోజనాల కోసం ఉద్దేశించిన సూదిని ఉపయోగించబోతున్నారా అని ఆయన నర్సులను ఉద్దేశించి నవ్వుతూ మోడీ అడిగారు. అయితే కాదని నర్సులు చెప్పారు. ఈ సమయంలో మోడీ చేసిన వ్యాఖ్యలకు తాము కూడ నవ్వామని వాళ్లు గుర్తు చేసుకొన్నారు.
మూడేళ్లుగా నివేదా ఎయిమ్స్ లో నర్సుగా పనిచేస్తున్నారు. 

ఇవాళ ఉదయం విధులకు హాజరైన ఆమెకు ప్రధాని మోడీ కరోనా టీకా వేయించుకొనేందుకు వస్తున్నారని వైద్యులు తనకు చెప్పారని నివేదా గుర్తు చేసుకొన్నారు. తాను కరోనా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నట్టుగా ఆమె చెప్పారు. టీకా వేసుకొనేందుకు వచ్చిన ప్రధానిని కలవడం బాగుందన్నారు.28 రోజుల తర్వాత ప్రధాని మోడీ కరోనా రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుందని నర్సు చెప్పారు.