Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో శరద్ పవార్ రాష్ట్ర మంత్రిపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు రాష్ట్రం విడిచివెళ్లే సమాచారం కూడా మీకు లేదా? అంటూ సొంత నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
Maharashtra political crisis: మహారాష్ట్ర రాజకీయలు కాకరేపుతున్నాయి. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఝలక్ ఇవ్వడంతో ప్రభుత్వం కూలిపోయే పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన సొంత వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏక్‌నాథ్ షిండేతో పాటు ముగ్గురు మంత్రులు, రెండు డజన్ల మంది ఎమ్మెల్యేలు ముంబయిని విడచి సూరత్ వెళ్తున్న విషయం గురించి సీఎంవో వద్ద కూడా సమాచారం లేదా? అంటూ సొంత నేతలను ప్రశ్నించినట్టు తెలిసింది. అలాగే, శివసేనలో ఏర్పడిన విభేదాల గురించి ఇంటెలిజెన్స్‌కు సమాచారం లేదా? ఎమ్మెల్యేల బృందం మహారాష్ట్రను వదిలి గుజరాత్‌కు వెళ్లినా రాష్ట్ర హోం శాఖ, ఇంటెలిజెన్స్ విభాగానికి ఎందుకు సమాచారం రాలేదని ఎన్‌సీపీ చీఫ్ ప్రశ్నించారు.. ఈ విషయంలో రాష్ట్ర హోం మంత్రి, ఆయన సొంత పార్టీ నేత దిలీప్ వాల్సే పాటిల్‌పై పవార్ విరుచుకుపడ్డారు. ఇదే ప్రశ్నను ఆయన తన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్‌కు కూడా సంధించారు.
హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ ఎన్సీపీకి చెందినవారు. హోం శాఖ సహాయ మంత్రి శంభురాజ్ దేశాయ్ శివసేనకు చెందినవారు. తిరుగుబాటు మంత్రిగా ఉన్న ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఒకరు. కాబట్టి రాష్ట్రంలో పరిస్థితి గురించి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను పూర్తిగా చీకట్లోకి తోశారు. మరి ఆ సమయంలో రాష్ట్ర హోంమంత్రి ఏం చేస్తున్నారు. ముగ్గురు మంత్రులతో పాటు శివసేన అగ్రనేత (ఏక్‌నాథ్ షిండే) రెండు డజన్లకు పైగా ఎమ్మెల్యేలతో ముంబైని వదిలి సోమవారం సూరత్‌కు వెళ్లిన విషయంపై సీఎంవో వద్ద సమాచారం లేదా అని శరద్ పవార్ అడుగుతున్నారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ బుధవారం ముంబైలోని ఆయన నివాసంలో పవార్‌ను కలిసిన నేపథ్యంలోనే ఆయన ఈ ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. పార్టీ అధినేత, మంత్రులతో జరిగిన సమావేశంలో ఇంటెలిజెన్స్ వైఫల్యంపై పవార్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయా అంశాలు శరద్ పవార్ ను తీవ్ర అసంతృప్తికి గురిచేసినట్టు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి.
తిరుగుబాటు గురించి రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వాన్ని ఎందుకు హెచ్చరించలేకపోయిందని కూడా ఆయన ఆశ్చర్యపోయారు. మూలాల ప్రకారం, శివసేన తిరుగుబాటు గురించి తెలియకపోవడానికి మొత్తం మహా వికాస్ అఘాధి నాయకత్వానికి శరద్ పవార్ నిందించారు. నాయకులు నిద్రపోతున్నారా.. భయాందోళనలకు గురవుతున్నారా అని ప్రశ్నించారు. కాగా, మరోవైపు ఈ రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణం అని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని కాంగ్రెస్ సీనియర్ మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. మహారాష్ట్రలో వారి సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం.. అక్కడి సుస్థిర ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నందుకు బీజేపీ, కేంద్రం పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం కూడా ఇలా చేస్తున్నారని విమర్శించారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని తామంతా (కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన) బలపరుస్తామని చెప్పదలచుకున్నానని అన్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్.. రాష్ట్రాలలో కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్న మైనారిటీలోకి తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు.
