నా అక్క మరణించింది. ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వలేదు. ఇంటికి దూరంగా పోస్టింగ్ వేశారు. ఇంటి వద్ద ఏం జరుగుతుందో తెలియని దుస్థితి. మేం ఎందుకు ఇంత ప్రెషర్‌లో ఉండాలి. కానిస్టేబుళ్లు కూడా మనుషులే కదా సార్.. అంటూ ఓ యూపీ కానిస్టేబుల్ ఆవేదనతో పై అధికారులను ఉద్దేశిస్తూ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
లక్నో: పర్సనల్ లైఫ్, కెరీర్ లైఫ్ రెండూ బ్యాలెన్స్ చేసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. అలాగైతే ముందుకు వెళ్లవచ్చు. ఏది డిస్టర్బ్ అయినా మానసిక గందరగోళం, అశాంతి, వైఫల్యాలు ఎదురవుతాయి. కానీ, కొన్ని ఉద్యోగాలు కచ్చితత్వంతో డ్యూటీపైనే ఎక్కువ ఫోకస్, టైమ్ కేటాయించాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ పోలీసు కానిస్టేబుళ్ల డ్యూటీ ఇటువంటిదే. అందుకే ఓ యూపీ కానిస్టేబుల్ ఆవేదనతో ఓ వీడియోను పోస్టు చేశాడు. కుటుంబానికి దీర్ఘకాలం దూరంగా ఉండటం, సెలవులు ఇవ్వకపోవడం వంటి కారణాలతో తీవ్ర మానిసక కుంగుబాటుకు గురవుతున్నామని, కుటుంబ సభ్యులు చనిపోయినా సెలవు ఇవ్వడం లేదని, ఆత్మహత్యలకు మూలం ఇందులోనే ఉన్నదని ఆయన పై అధికారులను ఉద్దేశిస్తూ నివేదించారు.
గత ఏడాది, రెండేళ్లలో పది నుంచి 12 మంది కానిస్టేబుళ్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, రెండు రోజుల క్రితమే అయోధ్యలో ఒకరు, మీరట్‌లో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారని వివరించాడు. వీరి ఆత్మహత్యలకు కారణమేమిటో ఎప్పుడైనా పరిశీలించారా? సార్ అంటూ పై అధికారులను అడిగారు. నాలుగు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో కానిస్టేబుల్ చేతులు జోడించి పై అధికారులను వేడుకున్నాడు. యూపీలోని బాగ్ పట్ పోలీసు డిపార్ట్‌మెంట్‌కు చెందిన కానిస్టేబుల్ ఓం వీర్ సింగ్ ఈ వీడియోను రికార్డు చేసి పోస్టు చేశాడు.
Also Read: స్టీల్ ప్లాంట్ కోసం కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్ష.. ‘10 లక్షల ఉద్యోగాలిప్పిస్తా’
జులై 20వ తేదీన తన సోదరి మరణించిందని, కానీ, సెలవు ఇవ్వలేదని అన్నాడు. పోలీసు కానిస్టేబుళ్లు కూడా మనుషులే కదా సార్.. ఇంత ఒత్తిడిలో తాము ఎందుకు ఉండాలి? అని అడిగాడు. సెలవులు ఇవ్వకున్నా కనీసం సొంత జిల్లాలోనైనా పోస్టింగ్ ఇవ్వాలని, లేదా పొరుగు జిల్లాలోనైనా ఇవ్వాలని, అలాగైతే కనీసం తమ కుటుంబ బాగోగుల గురించి తెలుసుకునే వీలు కలుగుతుందని తెలిపాడు. తమకు కేటాయించిన సెలవులు కూడా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది ఆయనకు అనుకూలంగా కామెంట్లు చేశారు.