న్యూఢిల్లీ: వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వివక్షాపూరితంగా ఉందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ  ఆరోపించారు.గురువారం నాడు ఆమె  ప్రధానమంత్రి మోడీకి  లేఖ రాశాడు. దేశ ప్రజలందరికీ  ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా చేయాలనే బాధ్యతను కేంద్రం విస్మరించిందన్నారు. 

18 ఏళ్లు వయస్సు పైబడిన వారికి ఉచితంగానే వ్యాక్సిన్ అందివ్వాలని ఆమె ఆ లేఖలో డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి గత ఏడాది నుండి పౌరులకు కఠినమైన బాధలను కలిగిస్తోందన్నారు.ఈ నిర్ణయాలు ఇప్పటికే ఉన్న సవాళ్లను మరింతను పెంచుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. 18 ఏళ్ల నుండి 45 ఏళ్లకు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలనే బాధ్యత నుండి కేంద్రం తప్పించుకొందని  ఆమె ఆ లేఖలో ఆరోపించారు. 

ఈ ఏడాది మే 1వ తేదీ నుండి మూడో విడత వ్యాక్సిన్ ప్రక్రియను  కేంద్రం ప్రారంభించనుంది. 50 శాతం వ్యాక్సిన్ ను కేంద్రానికి, మిగిలిన 50 శాతం వ్యాక్సిన్ ను  బహిరంగ మార్కెట్లో విక్రయించుకొనే వెసులుబాటును కేంద్రం ఫార్మా కంపెనీలకు ఇచ్చింది.వ్యాక్సిన్ తీసుకొనేందుకు 18 ఏళ్లు పైబడినవారంతా  ఈ నెల 24 నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్రం సూచించింది.