150 దేశాల్లోని యూజర్లకు ఆపిల్ థ్రెట్ నోటిఫికేషన్ పంపింది - హ్యాక్ అలెర్ట్ పై అశ్విని వైష్ణవ్ వివరణ
ఆపిల్ సంస్థ 150 దేశాల్లోని తమ యూజర్లకు థ్రెట్ అలెర్ట్ నోటిఫికేషన్ పంపించిందని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ విషయంలో కేంద్ర ఏజెన్సీలను దర్యాప్తు చేయాలని ఆదేశించినట్టు వెల్లడించారు.
తమ ఐఫోన్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలపై కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం స్పందించారు. ఈ విషయంపై కేంద్ర ఆందోళన చెందుతోందని, అయితే ఈ అలెర్ట్ మెసేజ్ లో 150 దేశాల్లోని ప్రజలకు వచ్చాయని తెలిపారు.
‘ఇండియా టుడే’తో అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ఈ విషయంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, కేసు సాంకేతిక స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని ఏజెన్సీలు, చట్ట అమలు సంస్థలను ఈ విషయంపై దర్యాప్తు చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. ‘‘ఆపిల్ నుంచి తమకు హెచ్చరికలు వచ్చాయని కొందరు ఎంపీలు ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దాదాపు 150 దేశాల్లోని ప్రజలకు యాపిల్ ఈ హెచ్చరిక నోటిఫికేషన్లను పంపింది. తమ ఫోన్లను ఎవరూ హ్యాక్ చేయలేరని ఆపిల్ వివరణ ఇచ్చింది.’’ అని తెలిపారు.
అయితే దేశం పురోభివృద్ధిని చూడకూడదనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష ఎంపీలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వైష్ణవ్ మండిపడ్డారు. కాగా.. తమకు ఆపిల్ నుంచి థ్రెట్ నోటిఫికేషన్లు వచ్చాయని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా, కాంగ్రెస్ నేతలు శశిథరూర్, పవన్ ఖేరా సహా ప్రతిపక్ష నేతలు వెల్లడించారు. ఈ విషయాన్ని పలువురు సోషల్ మీడియా వేదికగా బయటకు తీసుకొచ్చారు.
దీనిపై తాజాగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ‘‘దీనికి (హ్యాకింగ్) వ్యతిరేకంగా పోరాడుతున్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు కోరుకున్నంత (ఫోన్) ట్యాపింగ్ చేయవచ్చు, నేను పట్టించుకోను. మీరు నా ఫోన్ తీసుకోవాలనుకుంటే, మీకు ఇచ్చేస్తాను. మేం భయపడం, పోరాడేది మేమే’’ అని రాహుల్ గాంధీ తెలిపారు.