దయ చేసి ఆక్సిజన్ ఇప్పించండి: ట్విట్టర్‌లో ప్రధానికి మొరపెట్టుకున్న అపోలో ఎండీ
తీవ్రమైన ఆక్సిజన్ కొరతతో రోగుల ప్రాణాలు ప్రమాదంలో వున్నప్పటికీ, హర్యానా పోలీసులు పానిపట్‌లో వున్న ఐఓసీఎల్‌లోని ఎయిర్ లిక్విడ్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ బయటకు రానివ్వడం లేదు. ఎంతగా విజ్ఞప్తి చేసినా పోలీస్ అధికారులు స్పందించకపోవడంతో సంగీతా రెడ్డి ఈ పరిస్ధితిని ట్విట్టర్ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వైరస్ లక్షణాలతో ప్రజలు భారీగా ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. దీంతో వారికి చికిత్స అందించేందుకు బెడ్లు లేవు. దీనికి తోడు అత్యవసర పరిస్ధితుల్లో చికిత్స అందించేందుకు ఆక్సిజన్ సైతం దొరకని పరిస్ధితి.
మరోవైపు దేశంలో ఆక్సిజన్ కోసం రాష్ట్రాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికే తమ ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఢిల్లీ ఎత్తికెళ్లిందంటూ హర్యానా ప్రభుత్వం ఆరోపించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఆక్సిజన్ కోసం ఏకంగా ప్రధాని మోడీకి మొరపెట్టుకున్నారు అపోలో హాస్పిటల్స్ ఎండీ సంగీతా రెడ్డి.
తీవ్రమైన ఆక్సిజన్ కొరతతో రోగుల ప్రాణాలు ప్రమాదంలో వున్నప్పటికీ, హర్యానా పోలీసులు పానిపట్‌లో వున్న ఐఓసీఎల్‌లోని ఎయిర్ లిక్విడ్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ బయటకు రానివ్వడం లేదు. ఎంతగా విజ్ఞప్తి చేసినా పోలీస్ అధికారులు స్పందించకపోవడంతో సంగీతా రెడ్డి ఈ పరిస్ధితిని ట్విట్టర్ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పియూష్ గోయెల్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, హర్యానా సీఎంవోలకు ట్వీట్‌ను ట్యాగ్ చేశారు. అయితే దీనిపై కేంద్రం నుంచి ఆదేశాలు రావడంతో ప్లాంట్ నుంచి ట్యాంకర్‌ను బయటకు తీసుకురావడానికి డ్రైవర్‌కు అనుమతి లభించింది.
Also Read:ఆక్సిజన్ కోసం ఢిల్లీ - హర్యానా కొట్లాట: కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు
ఇదే సమయంలో ఆక్సిజన్ ట్యాంకులను అంబులెన్స్‌లుగా వర్గీకరించాలని, త్వరగా గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని సంగీతా రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి ఆమె మరో ట్వీట్ చేశారు.
అంతకుముందు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడుతై.. ఫరీదాబాద్‌లోని ఒక ప్లాంట్ నుంచి హర్యానా ప్రభుత్వ అధికారి ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరాను నిలిపివేశారని ఆయన ఆరోపించారు.
హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరాను తగ్గించడం దురదృష్టకరమని మనీష్ సిసోడియా ఆవేదన వ్యక్తం చేశారు. హర్యానా ప్రభుత్వంతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆక్సిజన్ ఉత్పత్తి కర్మాగారాలను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకుందని ఆయన మండిపడ్డారు.