పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రశంసల వర్షం కురిపించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు మమత బెనర్జీని బెంగాల్ టైగర్ అంటూ అభివర్ణించారు. 

పశ్చిమ బెంగాల్ అభివృద్ధి ఒక్క మమతా బెనర్జీకే సాధ్యమంటూ చెప్పుకొచ్చారు. పశ్చిమబెంగాల్ అభివృద్ధి కోరుకునే ప్రతీ వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలని కోరారు. మమతను మళ్లీ గెలిపించాలని కోరారు. 

మమతా బెనర్జీని ఓడించేందుకు బీజేపీ అనేక కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. పోలింగ్ బూత్ లో ఓటు వేసి రావడమే కాకుండా ఆ ఓటు ఏ పార్టీకి వేశామో, ఎవరికి పడిందో ఒకసారి వీవీ ప్యాట్ స్లిప్పులను సరి చూసుకోవాలని చంద్రబాబు సూచించారు. 

ఓటింగ్ సమయాల్లో ఎవరైనా తప్పు చేస్తే నిలదీయాలని ప్రజా స్వామ్యానికి విఘాతం కలిగించే వారిని ఉపేక్షించొద్దని హితవు పలికారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోవడం ఖాయమన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ యేతర ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 

శుక్రవారం కూడా పశ్చిమ బెంగాల్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. సీఎం మమతా బెనర్జీతో కలిసి కాశీపూర్ లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇకపోతే మమతా బెనర్జీ ఏపీ ఎన్నికల్లో విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే.