ఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామాపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఉర్జిత్ రాజీనామా దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. బీజేపీ యేతర కూటమిలో భాగంగా ఢిల్లీలో పర్యటిస్తున్న చంద్రబాబు రాజ్యాంగ సంస్థల గౌరవ ప్రతిష్ఠల్ని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దిగజార్చిందని మండిపడ్డారు.  

మోదీ ప్రభుత్వం విధ్వంసకర చర్యల వల్ల సీబీఐ, ఆర్బీఐ ప్రతిష్ఠ మసకబారిందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఎప్పుడూ లేనంతగా ప్రమాదంలో పడిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు.

ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ రాజీనామా వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అకస్మాత్తుగా ఆయన సోమవారం తన రాజీనామా లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. తన రాజీనామా తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఉర్జిత్ పటేల్ లేఖలో వెల్లడించారు.