ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌‌లో పనిచేస్తున్న శ్రీకాకుళానికి చెందిన జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఉర్లం మండలం చింటువానిపేటకు చెందిన బి. వెంకటేశ్ 2007 ఆగస్టులో భారత వైమానిక దళంలో చేరాడు.

అధికారిక పని నిమిత్తం మధ్యప్రదేశ్‌లోని ఆమ్లా నుంచి పంజాబ్‌లోని హల్వారాకు ఛత్తీస్‌గఢ్ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ ఫస్ట్ క్లాస్‌ కోచ్‌లో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం రైల్లోనే తన 9 ఎంఎం కార్బైన్ సబ్ మెషిన్‌గన్‌తో తలపై కాల్చుకున్నాడు.

కాల్పుల శబ్ధంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. జవాను మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది.