Asianet News TeluguAsianet News Telugu

అంబానీ ఇంటికి బెదిరింపుల కేసు: ‘‘బాలాజీ కుర్కురే’’ పేరిట పరమ్ బీర్ సింగ్ ఛాటింగ్

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి ఎదుట పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిపిన కేసులో ముంబై మాజీ పోలీస్ కమీషనర్ పరమ్ బీర్ సింగ్ పాత్ర వెలుగులోకి వచ్చింది. 'బాలాజీ కుర్కురే' పేరుతో ఆయన నిందితులతో మాట్లాడినట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. 

Antilia bomb scare case FaceTime ID Balaji Kurkure For Parambir Singh
Author
Mumbai, First Published Sep 10, 2021, 6:44 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం ముంబయిలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి ఎదుట పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిపిన కేసులో తాజాగా మరో ప్రముఖుడి పేరు తెరపైకి వచ్చింది. ఈ పేలుడు పదార్థాల కేసు, దానికి అనుబంధంగా జరిగిన మన్సూఖ్ హీరేన్ హత్య కేసును విచారిస్తున్న ఎన్ఐఏ అధికారులకు 'బాలాజీ కుర్కురే' అనే పేరున్న ఫేస్ టైమ్ ఐడీ సవాలుగా నిలిచింది. ఈ రెండు కేసుల్లో నిందితులు పలుమార్లు 'బాలాజీ కుర్కురే' అనే ఫేస్ టైమ్ ఐడీ కలిగిన వ్యక్తితో ఫోన్ చాటింగ్ చేసినట్టు వారు గుర్తించారు. దీన్ని మరింత లోతుగా పరిశోధించడంతో నివ్వెరపోయే అంశాలు వెల్లడయ్యాయి.

ఆ నకిలీ ఫేస్ టైమ్ ఐడీని ఉపయోగించి నిందితులతో మాట్లాడింది మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ అని గుర్తించారు. ఈ వేసవిలో పరమ్ బీర్ ఒక కొత్త స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేశారు. అయితే ఆ ఫోన్ లో ఫేస్ టైమ్ ఐడీ యాక్టివేట్ చేసే సమయంలో ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తుండగా, పరమ్ బీర్ సింగ్ తన టేబుల్ పై ఉన్న 'బాలాజీ కుర్కురే' ప్యాకెట్ ను చూశారు. ఇంకేమీ ఆలోచించకుండా తన కొత్త ఫోన్ కు 'బాలాజీ కుర్కురే' అనే ఫేస్ టైమ్ ఐడీని సెట్ చేశారు.

ఈ కుట్రలో భాగస్వాములైన మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే తదితరులతో పరమ్ బీర్ సింగ్ ఈ ఫేస్ టైమ్ ఐడీ ద్వారానే కీలక మంతనాలు జరిపినట్టు ఎన్ఐఏ విచారణలో తెలిసింది. అంతేకాదు, ఈ కేసులో సైబర్ విభాగం నివేదిక మార్చేందుకు కూడా పరమ్ బీర్ ఓ సైబర్ నిపుణుడికి డబ్బు ఆశ చూపించినట్టు వెల్లడైంది.

కాగా,అంబానీ ఇంటి ఎదుట పేలుడు పదార్థాల వాహనం కలకలం అనంతరం జైషే ఉల్ హింద్ ముఠా పేరుతో టెలిగ్రామ్ యాప్ లో ఓ సందేశం వచ్చింది. ఈ ఘటనకు తామే బాధ్యులమన్నది దాని సారాంశం. వాస్తవానికి జైషే పేరుతో వచ్చిన సందేశం అంబానీ వ్యవహారానికి సంబంధించింది కాదు... కానీ పరమ్ బీర్ సింగ్ ఆదేశాలతో ఆ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు అంబానీ ఘటనకు సంబంధించిన సందేశంగా తన నివేదికలో పేర్కొన్నాడని ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో తేలింది. పరమ్ బీర్ సింగ్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. కోర్టు నోటీసులు పంపుతున్నప్పటికీ ఆయన నుంచి స్పందన లేదు. ఫోన్ కూడా స్విచాఫ్ అని వస్తున్నట్టు తెలుస్తోంది

Follow Us:
Download App:
  • android
  • ios