మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన సుహెల్ దేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్
ఉత్తరప్రదేశ్ లో రైలు ప్రమాదం సంభవించింది. ఘాజీపూర్ సిటీ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్ వెళ్తున్న సుహెల్దేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. అయితే ఇందులో ఎలాంటి ప్రాణనష్టమూ సంభవించలేదు.
ఇటీవల రైలు ప్రమాద ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది జూన్ లో జరిగిన ఒడిశా రైలు ప్రమాదం వందలాది మంది ప్రాణాలను బలిగొంది. ఇటీవల ఏపీలోని విజయనరగంలోనూ రైలు ప్రమాదం జరిగింది. ఇందులో 13 మంది మరణించగా.. వందకు పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. తాజాగా యూపీలోనూ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టమూ సంభవించలేదు.
వివరాలు ఇలా ఉన్నాయి. ఘాజీపూర్ సిటీ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్ వెళ్తున్న సుహెల్దేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ ఔటర్ ప్రాంతంలో పట్టాలు తప్పింది. అయితే ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని నేషనల్ క్యాపిటల్ రీజియన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అమిత్ మాలవీయ తెలిపారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే పునరుద్దరణ పనులు మొదలుపెట్టారు. ప్రమాద పరిస్థితిని అంచనా వేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.