చెన్నై: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన విజయంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు గిరాకీ పెరిగింది. ఇప్పటికే ఆయన పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసు కోసం పనిచేయడానికి అంగీకరించారు. తాజాగా, మరో పార్టీ ఆయనను సంప్రదించింది. 

మమతా బెనర్జీతో పనిచేయడానికి ప్రశాంత్ కిశోర్ ఇటీవల ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. తాజాగా ఆయనకు తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే నుంచి పిలుపు వచ్చింది.ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన భారతీయ రాజకీయ కార్యాచరణ కమిటీ (ఐ-ప్యాక్) డైరెక్టర్లు రిషిరాజ్‌ సింగ్‌, వినేశ్‌ చందల్‌ శుక్రవారం సాయంత్రం తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత పళనిస్వామితో సమావేశం కానున్నట్లు తెలిసింది. 

చెన్నైలో తనతో చర్చించడానికి రావాలని పళనిస్వామి ఐ - క్యాప్ బృందాన్ని కోరారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరగనున్నాయి. ఈ విషయంపై చర్చించి, తమ వ్యూహకర్తగా పనిచేయడానికే ఆయన వారిద్దరిని పిలిచినట్లు తెలుస్తోంది. 2016 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధించింది. 

అయితే, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. 22 శాసనసభా స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అన్నాడీఎంకే ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించుకుంటోంది.