పూరీ కలెక్టర్ సమర్ధవర్మ, రాయగడ కలెక్టర్ స్వాధాదేవ్ సింగ్ వివాహం ఒడిషాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ ఈ నెల 15వ తేదీన పెళ్లి చేసుకోనున్నారు.
ప్రేమ ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతోందో తెలియదు. అంతేకాదు.. దానిని గుడ్డిది అని కూడా వుంటారు. ప్రేమకు వయసు, రంగు, ప్రాంతం, కులం, మతం ఇలాంటివి అడ్డురాదు. మనదేశంలో ఎంతోమంది సివిల్ సర్వీస్ ఉద్యోగులు శిక్షణ సమయంలోనో, విధి నిర్వహణలోనో ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న సందర్భాలు ఎన్నో. తాజాగా ఇద్దరు కలెక్టర్లు ప్రేమ వివాహం చేసుకోనున్నారు. వారే పూరీ కలెక్టర్ సమర్ధవర్మ, రాయగడ కలెక్టర్ స్వాధాదేవ్ సింగ్ .
వివరాల్లోకి వెళితే.. వీరిద్దరూ ఈ నెల 15వ తేదీన పెళ్లి చేసుకోనున్నారు. ఈ వేడుకకు సేవాయత్‌లు హాజరుకానున్నారు. ఇక్కడే ఒక విషయం చెప్పాలి. వీరిద్దరికి ఇది రెండో వివాహం. స్వాధాదేవ్ సింగ్ కొంతకాలం క్రితం బొలంగీర్ కలెక్టర్ చంచల రాణాను పెళ్లాడారు. అయితే దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అటు సమర్ధవర్మ రైల్వే అధికారిణి సుచిసింగ్‌ను పెళ్లాడారు. వీరి కాపురం కూడా ఎక్కువకాలం నిలవలేదు. ఒడిషాలో ప్రస్తుతం వీరి పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది.
