కేరళలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. పండు పేరుతో ఆశ చూపి.. కడుపుతో ఉన్న ఓ ఏనుగుని అతి క్రూరంగా హత్య చేశారు. ఆ ఘటన దేశ ప్రజలను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటన మరవకముందే.. అచ్చం అలాంటి సంఘటనే  చోటుచేసుకుంది. మరో ఏనుగు కూడా అదేవిధంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కూడా కేరళలో లోనే చోటుచేసుకోవడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే...  కడుపుతో ఉన్న ఏనుగు చనిపోవడంతో అలాంటి సంఘటనే మరోటి వెలుగు చూసింది. కాకపోతే ఇది ఏప్రిల్ లో చోటుచేసుకుంది. ఈ గర్భిణీ ఏనుగు చనిపోవడానికి ముందే.. టపాసులు నిండిన పైనాపిల్ తిని ఓ ఆడ ఏనుగు కొల్లాం జిల్లాలో చనిపోయినట్లు ఆలస్యంగా తెలిసింది.

ఆ ఏనుగు పోస్టుమార్టం రిపోర్టు ద్వారా ఈ విషయం వెల్లడయ్యింది. ఏనుగు దంతాలు పూర్తిగా నాశనం అయ్యాయి.  వాటిని తినే క్రమంలో దాని దంతాలు విరిగిపోయి ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు. ఆ ఏనుగు పొట్టలో ఉన్నది పటాసులేనని తాము అనుమానిస్తున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు.

కాగా.. రెండు రోజుల క్రితం ఓ గర్భిణీ ఏనుగు అత్యంత దారుణ స్థితిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆకలిగా ఉన్న ఏనుగు సమీపంలోని ఓ గ్రామంలో ప్రవేశించింది. వీదుల్లో తిరుగుతూంటే దానికి పైన్ ఆపిల్ చూపించి ఆశపెట్టారు. ఆహారం దొరికిందని తొండంతో నోట్లో వేసుకోగానే భారీ శబ్ధంతో అది పేలిపోయింది. ఏనుగుకు భారీగా రక్తస్రావం కాగా, కీటకాల బారి నుంచి రక్షించుకునేందుకు సమీపంలోని వెల్లియార్ నది వద్దకు వెళ్లి తొండాన్ని నీళ్లలో ఉంచింది. దానిని ఓ అటవీ శాఖ అధికారి ఫేస్ బుక్ లో పెట్టగా.. ఆ పోస్టు కాస్త వైరల్ గా మారింది.

విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది ఏనుగును రక్షించాలని కొన్ని గంటలపాటు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, మే 27న సాయంత్రం 4 గంటలకు ఏనుగు చనిపోయిందని పేర్కొన్నారు. అది ఎవరికీ ఏ హాని చేయలేదని, ఏ ఇంటిపై దాడి చేయలేదని.. అలాంటి మంచి జంతువును చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గర్భంతో ఉన్న ఏనుగు  కడుపులో ఉన్న మరో ప్రాణి గురించి ఆలోచించి నరకం అనుభవించిందని అక్కడి అధికారులు చెప్పడం గమనార్హం.

కాగా.. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మృగాలు అడవిలో కాదు.. మనుషుల మధ్యలోనే ఉన్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు.