పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో మళ్లీ బాంబు పేలింది. వారం రోజుల్లో ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం మూడో సారి. ఈ పేలుడు సమాచారం అందుకోగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ స్వర్ణ దేవాలయం సమీపంలో మళ్లీ భారీ పేలుడు సంభవించింది. గురువారం తెల్లవారుజామున పెద్ద శబ్దంతో ఈ పేలుడు జరిగింది. వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. వారం రోజుల వ్యవధిలో ఇది మూడో ఘటన. అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్ లో శనివారం (మే 6), సోమవారం (మే 8) రెండు పేలుళ్లు సంభవించాయి.
విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల జరిగిన పేలుళ్లకు ఇద్దరు వ్యక్తులు సూత్రధారి అని, వీరిలో ఒకరు మాజీ ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించారని ‘న్యూస్ 18’ నివేదించింది. దేశంలో సిక్కు వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని ఇవ్వడమే ఈ పేలుడు వెనుక ఉద్దేశమని అధికార వర్గాలు తెలిపాయి.
నిందితుడైన వ్యక్తికి ఖలిస్తాన్ అనుకూల ఉద్యమంతో సంబంధం లేదని తేలింది. కానీ అతడు తీవ్రమైన రాడికల్ అభిప్రాయాలకు ఆకర్శితుడయ్యాని తెలుస్తోంది. సిక్కు మతానికి సంబంధించిన సమస్యలను లేవనెత్తడం, అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయం సమీపంలో పొగాకు వాడకం, అమృత్ పాల్ సింగ్ పై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) విధించడాన్ని వ్యతిరేకించడం అతడి ఉద్దేశం.
అయితే పేలుడు ఘటనకు ముందు నిందితుడైన మాజీ ప్రభుత్వ ఉద్యోగి అధికారులను ఉద్దేశించి ఓ లేఖను రాశాడు. అయితే దురదృష్టవశాత్తు పేలుడులో అది ధ్వంసమైంది. కాగా.. దర్యాప్తులో భాగంగా నిందితులకు పొటాష్ విక్రయించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ పోటాష్ అమ్మిన వ్యక్తులకు నిందితులు ఎందుకు దానిని కొనుగోలు చేస్తున్నారో తెలియదని అధికారులు నిర్ధారించారు.
