ఢిల్లీ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన కార్ల దొంగ జాహిద్ అలియాస్ అన్నా ఎట్టకేలకు చిక్కాడు. హాపూర్ గ్రామానికి జాహిద్ మీరట్‌లో నివసిస్తూ.. తన ముఠా సభ్యులతో కలిసి దాదాపు 100 కార్లను చోరీ చేశాడు.

ఇతనిపై ఢిల్లీ, మీరట్, అలీఘడ్ ప్రాంతాల్లో ఎన్నో కేసులు ఉన్నాయి. దీనికి తోడు వాహనదారుల నుంచి ఫిర్యాదులు ఎక్కువ కావడంతో ఢిల్లీ పోలీసులు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.

ఆదివారం పోలీసులు కల్కాజీ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా చోరీ చేసిన కారులో వెళ్తుండగా జాహిద్ దొరికాడు. అతనిని అదుపులో తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా... అన్నాగ్యాంగ్ బాగోతం బయటపడింది.

ఈ ముఠా సభ్యులు జాహిద్‌ను అన్నా అని పిలిచేవారు.. దీంతో ఈ గ్యాంగ్‌కు అన్నాగ్యాంగ్ అని పేరు వచ్చింది. ఇతని నుంచి పోలీసులు పది కార్లను స్వాధీనం చేసుకున్నారు.