కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల్లో విజయం కోసం ఐదు ప్రధాన హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ‘‘అన్నభాగ్య’’ కూడా ఒకటి.
కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల్లో విజయం కోసం ఐదు ప్రధాన హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ‘‘అన్నభాగ్య’’ కూడా ఒకటి. ఈ వాగ్దానం ప్రకారం కేంద్రం ఉచితంగా ఇచ్చే ఐదు కిలోల బియ్యంతో పాటు బీపీఎల్ కుటుంలోని ప్రతి ఒక్కరికి నెలకు 5 కిలోల చొప్పున అదనంగా ఉచిత బియ్యం అందించాల్సి ఉంది. అయితే జూలై ఒకటి నుంచి ఈ హామీని అమలు చేయాల్సి ఉండగా.. పంపిణీకి అవసరమైన బియ్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు ఎదర్కొంటుంది.
ఈ క్రమంలోనే సిద్దరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బియ్యం బదులుగా డబ్బులను అందించాలని నిర్ణయించింది. బియ్యం కొరతను అధిగమించేవరకు.. కిలోకు రూ. 34 చొప్పున లబ్ధిదారులకు నగదు చెల్లించాలని నిర్ణయించింది. జులై 1 నుంచి నగదు పంపిణీ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
‘‘ఎఫ్‌సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కిలో బియ్యానికి 34 రూపాయల ప్రామాణిక రేటును కలిగి ఉంది. మేము బియ్యం పొందడానికి ప్రయత్నించాము. కానీమాకు అవసరమైన బియ్యాన్ని సరఫరా చేయడానికి ఏ సంస్థ ముందుకు రాలేదు (అదనంగా ఇవ్వడానికి)’’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం రాష్ట్ర ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మంత్రి కేహెచ్ మునియప్ప విలేకరులకు వివరాలు వెల్లడించారు.
‘‘అన్న భాగ్యను ప్రారంభించే తేదీ (జూలై 1) సమీపించింది. మేము మాట ఇచ్చాము అందుకే.. ఈరోజు జరిగిన కేబినెట్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర మంత్రులు బియ్యం సరఫరా చేసే వరకు బీపీఎల్ రేషన్ కార్డు హోల్డర్లకు ఎఫ్‌సీఐ రేటు ప్రకారం కిలో రూ.34 చొప్పున అందజేస్తామని నిర్ణయానికి వచ్చారు’’ అని మంత్రి మునియప్ప చెప్పారు.
ఒక కార్డులో ఒకరు ఉంటే అన్న భాగ్య పథకం కింద ఐదు కిలోల అదనపు బియ్యానికి నెలకు రూ. 170 లభిస్తుందని మంత్రి వివరించారు. రేషన్‌కార్డులో ఇద్దరు వ్యక్తులు ఉంటే రూ. 340, ఐదుగురు సభ్యులుంటే వారికి నెలకు రూ.850 లభిస్తుందని తెలిపారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని మునియప్ప చెప్పారు.
ఇక, జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ప్రతి వ్యక్తికి ఇప్పటికే ఇస్తున్న 5 కిలోలతో పాటు అదనంగా 5 కిలోల బియ్యం అందించే అన్న భాగ్య పథకాన్ని అమలు చేయడానికి కర్ణాటక నెలకు 2.29 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని చూస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్ణాటకకు అవసరమైన బియ్యం విక్రయించడానికి నిరాకరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. అయితే కేంద్రం మాత్రం తాము బియ్యం ఇస్తామని ఎలాంటి హామీ ఇవ్వలేదని చెబుతుంది. అయితే బియ్యం సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రత్యామ్నాయ సరఫరాదారుని కనుగొనలేదు.
