తిరువనంతపురం: మానవత్వాన్ని మచ్చతెచ్చేలా కేరళ రాష్ట్రంలోని ప్రజలు ప్రవర్తించారు. గర్భంతో ఉన్న ఓ ఏనుగుకు పైనాపిల్ లో పేలుడు పదార్ధాలు పెట్టారు. ఆ పండును తినడంతోనే పేలుడు పదార్ధాలు ఏనుగు నోట్లో పేలాయి. గత నెల 27వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఆ ఏనుగు మృతి చెందింది.

కేరళ రాష్ట్రంలోని ఆడ ఏనుగుకు సైలెంట్ వ్యాలీ వద్ద పేలుడు పదార్ధాలు ఉన్న పైనాపిల్ ఇచ్చారు. ఇది తిన్న ఆ ఏనుగు గాయపడింది. ఆ గ్రామం వదిలి వెల్లియార్ నదిలోకి దిగింది. 

ఈ విషయం తెలిసిన అటవీ శాఖాధికారులు మరో రెండు ఏనుగులను రప్పించి నదిలో ఉన్న ఏనుగును బయటకు రప్పించేందుకు చర్యలు చేపట్టారు. కానీ గాయపడిన ఏనుగు మాత్రం బయటకు రాలేదు.

గత నెల 27వ తేదీన ఏనుగు మరణించింది. ఈ విషయాన్ని మల్లప్పురం అటవీశాఖ అధికారి సోషల్ మీడియాలో తెలిపారు.ఏనుగు గర్భంతో ఉందని ఆయన ప్రకటించారు.

పంటలను రక్షించేందుకు స్థానికులు పైనాపిల్ తో పాటు ఇతర పండ్లలో పేలుడు పదార్ధాలు పెట్టి ఉచ్చు వేస్తారని అధికారులు చెబుతున్నారు. పొరపాటున ఏనుగు ఈ పండ్లను తిన్నదా లేదా ఉద్దేశ్యపూర్వకంగానే ఏనుగు ఈ పండ్లను తిన్నదా అనే విషయమై తేలాల్సి ఉంది. ఉద్దేశ్యపూర్వకంగానే కొందరు పేలుడు పదార్ధాలు ఉన్న పండ్లను ఏనుగుకు పెట్టారనే ప్రచారం కూడ సాగింది. కానీ, ఈ ప్రచారం విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

సోషల్ మీడియా వేదికగా పలువురు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.నిందితులను తీవ్రంగా ఖండించారు.నోరు లేని వారి తరపున నిలబడి పోరాటం చేయాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. పురాణాల్లోనే రాక్షసులు ఉండేవారని విన్నాం.. కానీ మానవులు నిజమైన రాక్షసులు అంటూ మరికొందరు కూడ వ్యాఖ్యలు చేశారు.

పలువురు నెటిజన్లు ఏనుగు స్కెచ్ లు వేసి తమ మానవత్వాన్ని ప్రదర్శించారు. ఈ ఏనుగును చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.