ప్రముఖ సింగర్, డ్యాన్సర్ సప్నా చౌదరి పేరు రెండు మూడు రోజులుగా దేశ రాజకీయాల్లో మార్మోగిపోతోంది. రెండు రోజుల క్రితం ఆమె కాంగ్రెస్ లో చేరబోతోందని వార్తలు వచ్చాయి. తాజాగా.. ఆమెను రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కామెంట్స్ చేయడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే... ‘‘సప్నా చౌదరి కాంగ్రెస్ లో చేరింది.. వెల్‌కమ్‌ టూ కాంగ్రెస్‌ ఫ్యామిలీ’’ అని యూపీసీసీ చీఫ్‌ రాజ్‌బబ్బర్‌ శనివారం ఉదయం ట్వీట్‌ చేశారు. ప్రియాంక గాంధీతో కలిసి దిగిన ఆమె ఫోటోను కూడా ఆయన షేర్‌ చేశారు. మధుర నియోజకవర్గంలో బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌, సిటింగ్‌ ఎంపీ హేమమాలినిపై సప్నా చౌదరిని నిలబెట్టాలన్నది కాంగ్రెస్‌ వ్యూహమని ప్రచారం జరిగింది.

అయితే..ఆకస్మికంగా ఆమె ఆదివారం ఉదయం ఓ ప్రకటన చేస్తూ తాను కాంగ్రెస్‌లో చేరలేదనీ, అసలు ఏ పార్టీ తరఫునా పోటీ కూడా చేయట్లేదని, ప్రియాంకతో ఉన్న ఫోటో కూడా పాతదని పేర్కొనడంతో పరిస్థితి అకస్మాత్తుగా మారింది. షాక్‌ తిన్న కాంగ్రెస్‌వాదులు ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు ఫారం నింపుతున్న ఓ వీడియోను బయటపెట్టడంతో అది వైరల్‌ అయ్యింది. 

‘ఆమె స్వయంగా శనివారం పార్టీ ఆఫీసుకొచ్చి ఫారం నింపి వెళ్లారు. ఆమె సోదరి కూడా కాంగ్రెస్‌లో చేరారు’ అని యూపీసీసీ ప్రధాన కార్యదర్శి నరేంద్ర రథి ప్రకటించారు. కానీ సప్న దాన్ని తిరస్కరించారు. ‘సప్న సంతకాన్ని కాంగ్రెస్‌ ఫోర్జరీ చేసింది. ఆ ఫారం 2011-15 మధ్య కాలంది’’ అని బీజేపీ అధికార ప్రతినిధి అమిత్‌ మాలవీయ వ్యాఖ్యానించారు. 

యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్‌ మరో అడుగు ముందుకేసి- ‘‘రాహుల్‌ ఆమెను పెళ్లి చేసుకుంటే బావుంటుంది. ఎందుకంటే ఇటలీలో రాహుల్‌ తల్లి సోనియా ఏం వృత్తి (పేషా) చేసేవారో- సప్నా చౌదరి కూడ ఇప్పుడదే పనిచేస్తోంది. మీ నాన్న (రాజీవ్‌) సోనియాను పెళ్లి చేసుకున్నట్లే మీరు ఆమెను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది’’ అని వ్యాఖ్యానించడంతో తీవ్ర దుమారం రేగింది.

కాగా.. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుతు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ నేతలు.. తీవ్ర స్థాయిలో బీజేపీపై మండిపడుతున్నారు. సోనియా గాంధీని కూడా కించపరిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.