కేదర్‌నాథ్ నుంచి తిరిగి ప్రయాణం అవుతుండగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ఉత్తరాఖండ్‌లో తప్పిపోయింది. ఆమెకు తెలుగు తప్పా మరే భాష రాదు. దీంతో సహాయం అడగడం కూడా సాధ్యం కాలేదు. ఆమెను గమనించిన పోలీసులు సమీపించి ఆరా తీయగా ఆమె తెలుగులో మాత్రమే మాట్లాడింది. దీంతో వారు గూగుల్ ట్రాన్స్‌లేట్ సహాయం తీసుకుని ఆమెను వారి బంధువుల వద్దకు పంపించగలిగారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 68 ఏళ్ల వృద్ధురాలు కేదర్‌నాథ్ యాత్రలో తప్పిపోయింది. చుట్టూ మనుషులే కానీ, వారితో కమ్యూనికేషన్ సాధ్యం కాలేదు. ఎందుకంటే ఆమెకు తెలుగు మినహా మరే భాషలో పరిజ్ఞానం లేదు. మిగతా వారికి తెలుగుపై అవగాహన లేదు. దీంతో సహాయం పొందడమూ కష్టమే అయింది. ఆమెను చూసి సమీపించిన పోలీసులకూ ఈ సమస్య తప్పలేదు. కానీ, వారు ఒక పరిష్కారం కనుగొన్నారు. గూగుల్ ట్రాన్స్‌లేట్ ద్వారా ఆమెతో సంభాషించగలిగారు. ఆమె ద్వారా ఫోన్ నెంబర్ తీసుకుని కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు.
కేదర్‌నాథ్ నుంచి ఆ కుటుంబం తిరుగుపయానమైంది. ఉత్తరాఖండ్‌లో కఠిన వాతావరణం కారణంగా ఆమె తప్పిపోయింది. మళ్లీ బంధువులను కలుసుకోవడం సాధ్యం కాలేదు. ఒంటరిగా మిగిలిపోయింది. రాష్ట్రం కాని రాష్ట్రంలో తెలుగు భాష రాని ప్రజల మధ్య ఆమె ఒంటరిగా మారిపోయింది.
గౌరికుండ్ షటిల్ పార్కింగ్ లాట్ వద్ద ఆమె ఆందోళనకర మన:స్థితిలో స్థానిక పోలీసులకు కనిపించింది. పోలీసులు ఆమెను సమీపించి విషయం ఏమిటని అడిగారు. ఆమె చెప్పడం మొదలుపెట్టింది. కాని, ఒక్క ముక్క అర్థం కాలేదు. ఆమెకు హిందీ లేదా ఇంగ్లీష్ రాదనే విషయం వాళ్లకు అర్థమైంది. ఆమె కేవలం తెలుగు మాత్రమే మాట్లాడుతున్నదని ఎస్ఐ రమేశ్ చంద్ర బెల్వాల్ తెలిపారు.
Also Read: Supreme Court: మహారాష్ట్రలో ఎవరి ప్రభుత్వం ఉంటుంది? బీజేపీ.. ఎన్సీపీ దోస్తీ వదంతులకు ఫుల్‌స్టాప్?
ఆ వృద్ధురాలిని ఆమె కుటుంబంతో కలిపిస్తామని ఆమెకు సైగల ద్వారా తెలియజేశామని వివరించారు. కొంత ఉపశమనం పొందిన తర్వాత గూగుల్ ట్రాన్స్‌లేట్ సహాయంతో ఆమె చెప్పే విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. చివరకు మొబైల్ నెంబర్ ఆమె ద్వారా తెలుసుకుని ఫోన్ చేశారు. ఈ వృద్ధురాలి కోసమే ఆందోళనగా వెతుకులాటలో ఉన్న వారు ఫోన్ లిఫ్ట్ చేసి ఊపిరిపీల్చుకున్నారు. వారు సోన్‌ప్రయాగ్‌లో ఉన్నట్టు తెలిపారు.
ఓ వాహనాన్ని ఏర్పాటు చేసి సోన్‌ప్రయాగ్‌కు ఆమెను తరలించినట్టు ఆ పోలీసు అధికారి తెలిపారు.
