న్యూఢిల్లీ: ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత  అవలంభించిన వ్యూహంపై 21 రాజకీయ పార్టీలు ఈ నెల 21వ తేదీన సమావేశం కానున్నాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై  ఈ సమావేశంలో చర్చించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం నాడు భేటీ అయ్యారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై చంద్రబాబునాయుడు రాహుల్ కు ఓ నివేదిక ఇచ్చారు. సుమారు వందకు పైగా ఎంపీ సీట్లు గతంలో కంటే బీజేపీకి తక్కువగా వచ్చే అవకాశం ఉందని బాబు రాహుల్ కు నివేదిక ఇచ్చారు.

ఈ నివేదిక ఆధారంగా వ్యూహన్ని అనుసరించాలని బాబు రాహుల్ కు సూచించారు. ఎన్నికల తర్వాత తమ మధ్య పొత్తు కుదిరినట్టుగా ఓ లేఖను ఈ నెల 21న జరిగే సమావేశంలో ఈ పార్టీలు ఫైనల్ చేసే అవకాశం ఉంది.

తమ కూటమికి మెజారిటీ స్థానాలు దక్కితే తమ కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని  ఈ పార్టీలు రాష్ట్రపతికి లేఖను ఇవ్వనున్నారు. గతంలో గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుకు అనుసరించిన విధానాలను ఈ సందర్భంగా ప్రస్తావించే అవకాశం ఉంది. మరో వైపు కోర్టు తీర్పులను కూడ ప్రస్తావించే ఛాన్స్ లేకపోలేదు.

ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి కంటే ఒక్క సీటు ఎక్కువగా  21 పార్టీల కూటమికి వచ్చినా కూడ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం లేకపోలేదు.