వారణాసిలోని జ్ఞానవాపి-శృంగర్ గౌరీ కాంప్లెక్స్‌లోని జ్ఞానవాపి మసీదు సమీపంలో సర్వే, వీడియోగ్రఫీ చేస్తున్న సమయంలో ప్రాచీన కాలం నాటి రెండు స్వస్తిక్ గుర్తులు బయటపడ్డాయి. అవి బాగా రంగు మారిపోయి ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. 

వారణాసిలోని జ్ఞానవాపి-శృంగర్ గౌరీ కాంప్లెక్స్‌లోని జ్ఞానవాపి మసీదు సమీపంలో సర్వే, వీడియోగ్రఫీ చేస్తున్న సమయంలో ప్రాచీన కాలం నాటి రెండు స్వస్తిక్ గుర్తులు బయటపడ్డాయి. అవి బాగా రంగు మారిపోయి ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ స్వస్తికలు చాలా ఏళ్ల క్రితం చిత్రీకరించి ఉంటారని.. మసకబారినప్పటికీ స్వస్తిక్ గుర్తులు కనిపిస్తున్నాయని సర్వే అధికారులు చెప్పారు. అయితే అక్కడ నిరసనలు చెలరేగడంతో సర్వే ప్రక్రియ అర్దతరంగా నిలిపివేసినట్టుగా అధికారులు తెలిపారు. వివరాలు.. జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీకి చెందిన మహిళలు రాఖీ సింగ్, లక్ష్మీదేవి, సీతా సాహు తదితరులు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించారు. 

ఈ కేసును విచారణకు స్వీకరించిన వారణాసి జిల్లా కోర్టు వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు అడ్వొకేట్‌ కమిషనర్‌ను నియమించారు. మసీదు ప్రాంగణంలో పురావస్తు శాఖతో కలిసి వాస్తవాలను గుర్తించేందుకు సర్వే చేయాలని ఆదేశించింది. రంజాన్‌ తర్వాత సర్వేను ప్రారంభించి.. ఈ నెల 10లోగా పూర్తిచేయాలని సూచించింది. ఈ క్రమంలో శుక్రవారం అడ్వొకేట్‌ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని సర్వే బృందం శుక్రవారం ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టడంతో అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. 

ఇక, కోర్టు ఆదేశాల మేరకు వీడియో తీసే ప్రయత్నం చేయగా.. శనివారం మసీదు నిర్వహణ కమిటీ, ముస్లింల నుంచి నిరసన, ఆందోళనలు వ్యక్తం కావడంతో కార్యక్రమం మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. 

ఇక, అడ్వొకేట్‌ కమిషనర్‌ను మార్చాలంటూ.. వేరే వ్యక్తిని నియమించి సర్వే చేస్తే తమకు అభ్యంతరం లేదంటూ మసీదు నిర్వహణ కమిటీ పేర్కొంది. ప్రస్తుత కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రా స్థానంలో మరో అధికారిని నియమించాలని గణవాపి మసీదు నిర్వహణ కమిటీ సభ్యులతో సహా ముస్లిం సమాజం వారణాసి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసును విచారించిన న్యాయమూర్తి రవికుమార్ దివాకర్ తీర్పును మే 9వ తేదీకి రిజర్వ్ చేశారు. దీనిపై తేలే వరకు సర్వే నిలిచిపోయినట్టేనని తెలుస్తోంది.