ఇండియాలో ట్యాలెంట్‌కు కొదవ లేదు.. టన్నుల కొద్దీ ఉన్నదనే డైలాగ్‌లను పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తరుచూ నిరూపిస్తుంటారు. తాజాగా, ఓ పాలవ్యాపారి తనకు అనుకూలంగా డిజైన్ చేసుకున్న ఓ వాహనాన్ని ట్వీట్ చేసి అబ్బురపడిపోయారు. అది పూర్తిగా ఎఫ్1 రేసింగ్ కారు తరహాలోనే ఉన్నది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతున్నది. 

న్యూఢిల్లీ: దేశీయ ట్యాలెంట్‌ను గుర్తించడానికి పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ముందు ఉంటారు. దేశంలో మారుమూలల్లో దాగి ఉన్న నైపుణ్యం, మెళకువలు, ట్యాలెంట్‌ను బయటి ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆసక్తి చూపుతాడు. అవసరాలకు సరిగ్గా ఇమిడిపోయే.. తాహతుకు మించకుండా డబ్బుతో ఎంతో ట్యాలెంట్‌తో చేసే ఎన్నో ఆవిష్కరణలను ఆయన హైలైట్ చేశాడు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ ట్యాలెంట్ హంట్ చేస్తుంటారు. అదేమిటో.. ఆయనకే ఇంటరెస్టింగ్ వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా, మరో ఆసక్తికరమైన, జుగడ్ టెక్నాలజీని వెల్లడించే ఓ వీడియోను ఆయన ట్వీట్ చేశారు.

రోడ్స్ ఆఫ్ ముంబయి అనే ట్విట్టర్ హ్యాండిల్ ఓ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి పాలు, పాల పదార్థాలను డెలివరీ చేస్తూ ఉన్నాడు. అయితే, ఆ వ్యక్తి నడుపుతున్న వాహనం ఎప్పుడూ ఎక్కడ చూడని విధంగా ఉన్నది. అది పూర్తిగా ఎఫ్1 రేసింగ్ కారును తలపించింది. డోమ్‌లు లేకుండా కేవలం రాడ్‌లతో ఆ వాహనాన్ని డిజైన్ చేసినట్టూ ఉన్నది. మూడు చక్రాల ఆ వాహనం చూస్తే ఎవరైనా అబ్బురపడకుండా ఉండరు. అది పూర్తిగా రేసింగ్ కారు తరహాలోనే ఉన్నది. ఆ వ్యక్తి కూడా వెనుక పాల క్యాన్‌లను పెట్టుకుని ముందు కూర్చుని ఆ వాహనాన్ని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. రేసింగ్ కారులో డ్రైవింగ్ చేసినట్టుగానే ఆయన కూడా ఆ కొత్త రకమైన వాహనాన్ని నడిపాడు. ఆ వాహనం రోడ్డుపై వేగంగా దూసుకెళ్తూ ఉంటే ఓ కారులోని వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను రోడ్స్ ఆఫ్ ముంబయి ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.

ఆ వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఆ వీడియోకు తనదైన వ్యాఖ్య జతచేశారు. ఈ వాహనం రోడ్డు నిబంధనలకు లోబడి ఉన్నదా? లేదా? అనే విషయాన్ని తాను చెప్పలేనని, కానీ, వాహనాలపై ఆయన ప్యాషన్‌ మాత్రం ఎప్పటికీ అనియంత్రితంగానే ఉంటుందని ఆశిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో తాను చూసిన కూలెస్ట్ థింగ్ అని తెలిపారు. అంతేకాదు, ఆ రోడ్డు వారియర్‌ను తాను కలువాలని అనుకుంటున్నట్టు వివరించారు.

Scroll to load tweet…

ఆ వీడియోను పోస్టు చేస్తూ రోడ్స్ ఆఫ్ ముంబయి హ్యాండిల్ ఫన్నీ కామెంట్ చేసింది. మీరు ఎఫ్1 డ్రైవర్ కావాలని అనుకుంటున్నా.. డైరీ వ్యాపారానికే సహాయపడాలని కుటుంబం పట్టుబడితే ఇలా ఉంటుందన్నట్టుగా ట్వీట్ చేసింది. కాగా, నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లతో రియాక్ట్ అయ్యారు.

Scroll to load tweet…

ఈ వీడియో చూస్తే.. బ్యాట్‌మ్యాన్ పాలను అమ్ముతున్నట్టు ఉన్నదని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఇండియాకు రానందుకు ఎఫ్1ను ఒకరు నిందించారు. ఇక్కడ ఎంతో ట్యాలెంట్ ఉన్నదని, కానీ, ఎఫ్1 అంతా మిస్ అవుతున్నదని పేర్కొన్నాడు. బ్యాట్‌మొబైల్ లాగే ఇది మిల్క్‌ మొబైల్ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. మరొకరు ఎంతో అద్భుతంగా కనిపిస్తున్న ఓ రేసింగ్ కారును ట్వీట్ చేసి.. వీడియోలోని కారు ఇలాగే ఉన్నదని పేర్కొన్నారు.