ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గొప్ప వ్యాపారవేత్త అని అందరికీ తెలుసు. అయితే... ఆయన వ్యాపారవేత్తగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు నచ్చిన విషయాన్ని, ఆకర్షించిన అంశాన్ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

కాగా.. తాజాగా ఆయన ఓ వీడియో షేర్ చేశారు. ఆటలో అయినా జీవితంలో అయినా ఆఖరి నిమిషం వరకు పోరాడితే ఫలితం ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలుస్తుంది అంటూ ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేశారు. ఈ వీడియో ఓ కబడ్డీ మ్యాచ్‌కు సంబంధించినది.

కూతకు వెళ్లిన ఓ ఆటగాడు ప్రత్యర్థి జట్టు ఆటగాడ్ని అవుట్ చేసి లైన్ వద్దకు చేరుకుంటాడు. అయితే తన కోర్టులోకి వెళ్లకుండా ఇంకా అక్కడే ఉండి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను రెచ్చగొడతాడు. ఇంతలో అవుటైన ఆటగాడు అక్కడికి వచ్చి కవ్విస్తున్న ఆ రైడర్‌ను ఒక్కసారిగా తమ కోర్టు లోపలికి లాగడంతో అందరూ వచ్చి మూకుమ్మడిగా అతడ్ని పట్టుకోవడం వీడియోలో చూడొచ్చు. 

 

ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్ర.. ప్రొకబడ్డీ లీగ్‌లో ఇలాంటి సీన్ చూడలేదంటూ కామెంట్ చేశారు. ఏదైనా చివరి వరకు పోరాడు అనే సందేశాన్ని ఇచ్చారు మహీంద్ర. పాయింట్ వచ్చేందుకు ఎలాంటి ఆస్కారం లేకపోగా, ప్రత్యర్థికి ఓ పాయింట్ కోల్పోయిన స్థితిలో కూడా పోరాటపటిమ ఉంటే ఎలాంటి ఫలితమైనా వస్తుందని సదరు ఆటగాడు నిరూపించాడు.