ఎవరికి వారు ముందుగా తమ గమ్యాన్ని చేరుకోవాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే.. ఓ చోట మాత్రం అలా కాదు.. ట్రాఫిక్ సమయంలోనూ చాలా క్రమశిక్షణతో ఉన్నారు.
ఈ రోజుల్లో ట్రాఫిక్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సిటీ, పెద్ద సిటీ అనే సంబంధం లేకుండా.. ఎక్కడైనా ట్రాఫిక్ బాగా పెరిగిపోతోంది. ఇక ఈ ట్రాఫిక్ సమయంలో.. ఎవరూ ఓపికతో ఉండరు. ఎవరికి వారు ముందుగా తమ గమ్యాన్ని చేరుకోవాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే.. ఓ చోట మాత్రం అలా కాదు.. ట్రాఫిక్ సమయంలోనూ చాలా క్రమశిక్షణతో ఉన్నారు. ఈ ఫోటో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కంట పడింది. అంతే.. ఆయన వారి క్రమశిక్షణకు ఫిదా అయిపోయారు. వెంటనే తన అభిప్రాయాన్ని తెలియేస్తూ.. ఆ ఫోటోని షేర్ చేశారు.
ఇంతకీ మ్యాటరేంటంటే.. తరచూ సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ ఫొటోను షేర్ చేశారు. బహుశా అది ట్రాఫిక్ సిగ్నల్ వద్దో, ఇంకేదో కూడలి వద్దో తీసిన ఫొటోలా ఉంది. వాహనాలన్నీ కొండవీటి చాంతాడంత పొడవున బారులుతీరి ఉన్నాయి. రోడ్డును రెండుగా విభజించే తెల్లగీత స్పష్టంగా కనిపిస్తోంది. భారీ వాహనాల నుంచి ద్విచక్ర వాహనాల వరకు అన్నీ ఉన్నాయి. కానీ విచిత్రం ఏమిటంటే.. అన్ని వాహనాలతో ఒక వరుస కిక్కిరిసిపోయి ఉన్నప్పటికీ ఒక్కరంటే ఒక్కరు కూడా తెల్లగీతను దాటి ఇటువైపునకు రాలేదు. అంతేనా.. కనీసం కాలు కూడా తెల్లగీత దాటకపోవడం నిజంగా ఆశ్చర్యమే.
ఈ ఫొటో చూసి ఇది వేరే ఏ దేశానిదో అనుకుంటే అంతకుమించిన పొరపాటు మరోటి ఉండదు. అచ్చంగా మన దేశంలోని మిజోరంలో తీసిన ఫొటో ఇది. అక్కడి ప్రజల క్రమశిక్షణకు, ట్రాఫిక్ సెన్స్‌కు ఈ ఫొటో చక్కని ఉదాహరణ. ఇది చూసి అందరూ ముచ్చటపడుతున్నారు. వారికి అంతటి సహనం ఎలా వచ్చింటూ ట్విట్టర్‌లో కామెంటే కామెంట్లు. అందరిలోనూ ఇలాంటి సెన్సే ఉంటూ ట్రాఫిక్ జామ్‌లు ఎందుకు జరుగుతాయి.. ప్రమాదాలకు ఆస్కారం ఎక్కడుంటుంది? అంటూ తోచిన కామెంట్ చేస్తున్నారు.
మిజోరంలో కఠినమైన ట్రాఫిక్ జరిమానాలు, శిక్షలు లేవు. అక్కడి ప్రభుత్వాలు, పోలీసులు కూడా ట్రాఫిక్ నిబంధనలపై పెద్దగా అవగాహన కార్యక్రమాలు చేపట్టవు. కానీ ప్రజలు మాత్రం ఎవరికివారే క్రమశిక్షణగా మసలుకుంటూ మొత్తం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో ఇప్పుడు అందరూ మెచ్చిన ఫోటోగా నిలిచింది.
