భారతదేశ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోంది - బ్రస్సెల్స్ లో రాహుల్ గాంధీ
భారత దేశ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రజాస్వామ్య సంస్థలపై పూర్తి స్థాయిలో దాడి జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం యూరప్ ట్రిప్ లో ఉన్న ఆయన.. గురువారం ఉదయం బ్రస్సెల్స్ కు చేరుకొని.. అక్కడ మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ మూడు రోజులు పర్యటన కోసం యూరప్ వెళ్లారు. అందులో భాగంగా మొదటి రోజైన గురువారం ఉదయం ఆయన బెల్జియంలోని బ్రస్సెల్స్ కు చేరుకున్నారు. అక్కడి పార్లమెంట్ సభ్యులతో సమావేశమైన అనంతరం అక్కడి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
భారత్ లో ప్రజాస్వామ్య సంస్థలపై పూర్తి స్థాయిలో దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మన దేశ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోందని అక్కడ భారత సంతతి నాయకులతో అన్నారు. ‘‘భారత్ ను నడుపుతున్న వ్యక్తుల బృందం దేశ ప్రజాస్వామ్య నిర్మాణంపై దాడి చేస్తోందనే భావన వ్యక్తమవుతోంది. ఈ పాయింట్ ను ఎవరూ మిస్ అవుతున్నారని నేను అనుకోవడం లేదు. ప్రజాస్వామిక పోరాటం మాదే. దాన్ని మేమే చూసుకుంటాం. మన సంస్థలపై దాడి ఆగుతుంది’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
ఆర్టికల్ 370 కింద జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక అధికారాలను రద్దు చేయడంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కశ్మీర్ పై కాంగ్రెస్ పార్టీ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమన్నారు. ‘‘ఇది మనది తప్ప మరెవరి పని కాదు. ప్రజాస్వామిక సంస్థలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. కాశ్మీర్ సహా భారత్ లోని ప్రతి ప్రాంతానికీ ఇది వర్తిస్తుంది’’ అని పేర్కొన్నారు.
భారతదేశంలో వివక్ష, హింస పెరిగిపోతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘మైనారిటీలపై కచ్చితంగా దాడులు జరుగుతున్నాయి. కానీ దళితులు, నిమ్న కులస్తులు సహా అనేక ఇతర వర్గాలు కూడా దాడులకు గురవుతున్నాయి.’’ అని తెలిపారు. కాగా రష్యా, ఉక్రెయిన్ విషయంలో ప్రభుత్వంతో రాహుల్ గాంధీ ఏకీభవించినట్లు తెలుస్తోంది. ‘‘రష్యా, ఉక్రెయిన్ల మధ్య వివాదంపై భారత్ ప్రస్తుత వైఖరితో ప్రతిపక్షాలు ఏకీభవిస్తాయని నేను అనుకుంటున్నాను. రష్యాతో మనకు సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న దానికంటే ప్రతిపక్షాలకు భిన్నమైన వైఖరి ఉంటుందని నేను అనుకోవడం లేదు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.