Asianet News TeluguAsianet News Telugu

కష్టాల్లో ఫ్లిప్‌కార్ట్: ఢిల్లీ హైకోర్టుకు ‘ఆమ్వే’

నవరాత్రి, దసరా పండుల సీజన్‌లో ఆకర్షణీయ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకున్న ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ‘ఫ్లిప్ కార్ట్’కు కష్టాలు మొదలయ్యాయి. డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ ‘ఆమ్వే’ తమ ఉత్పత్తులను నిబంధనలను ఉల్లంఘించి మరీ విక్రయిస్తున్నదని మండి పడింది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొంది. 

Amway drags Flipkart to court for selling its product 'illegally': Report
Author
Mumbai, First Published Oct 19, 2018, 3:03 PM IST

ముంబై: అమెరికా ఆన్‌లైన్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ తో టైఅప్ తర్వాత  దేశీయంగా దూసుకెళ్తున్న  డిజిటల్ మేజర్ ‘ఫ్లిప్‌కార్ట్‌’కు మరో రిటైల్ మేజర్ ‘ఆమ్వే’ షాక్‌ ఇచ్చింది. ఫ్లిప్ కార్ట్ భారతీయ ఈ -కామర్స్ నిబంధనలకు విరుద్ధంగా తమ ఉత్పత్తులను అనధికారికంగా విక్రయిస్తోందని డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ సంస్థ ఆమ్వే ఆరోపిస్తోంది. 2016లో కేంద్రం జారీ చేసిన డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్‌ను  అతిక్రమించిందని వాదించింది.

మిచిగాన్ కేంద్రంగా ప్రత్యక్ష విక్రయాలు సాగిస్తున్న ఆమ్ వే.. ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. కానీ దీనిపై ఫ్లిప్ కార్టు నుంచి ప్రతిస్పందన రానందున ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపింది. వినియోగదారుల ప్రయోజనాల రీత్యా న్యాయ వ్యవస్థ జోక్యాన్ని కోరనున్నట్లు పేర్కొంది. తమ విక్రయాలతో ప్రత్యక్షంగా కొనుగోలుదారులకు లబ్ధి చేకూరుతుందని వివరించింది.  

డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల వద్ద పర్మిషన్ తీసుకున్నాకే వాటి ఉత్పత్తులను విక్రయించాలన్న సంగతిని వాల్ మార్ట్ సారథ్యంలోని ఫ్లిప్ కార్ట్ మరిచిపోయిందని ఆమ్ వే అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. తమ సంస్థ ఇతర సంస్థల ఉత్పత్తులను విక్రయించే విషయంలో నైతిక ప్రమాణాలను, నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తోందని ఆమ్వే ప్రతినిధి చెప్పారు. అసలు ఆమ్ వే ఉత్పత్తులను థర్డ్ పార్టీ షాపుల్లో గానీ, ఆన్ లైన్ లోగానీ ఇతరులు విక్రయించరాదని ఆ సంస్థ స్పష్టం చేసింది. 

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు.. తాము సిల్వర్ పాయిల్ సీళ్లపై లిడ్స్ ముద్రించిన యూనిక్ కోడ్ తొలగించి మరీ విక్రయాలు చేస్తున్నారని ఆరోపించింది. వాటిని తొలగించడం వల్ల సదరు ఉత్పత్తులను ఎవరు తయారు చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.  

ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌  'అనధికార' అమ్మకాలు జరుపుతోందని ఆరోపించింది. ముందస్తు అనుమతి లేకుండా అక్రమంగా  తమ ప్రొడక్ట్స్‌ను విక్రయిస్తోందని, ఈ కామర్స్‌ సంస్థలు ఆన్‌లైన్‌ ఉత్పత్తుల లిస్టింకు ముందు కంపెనీల ముందస్తు అనుమతి తప్పనిసరి అన్న భారతదేశ మార్గదర్శకాలను ఫ్లిప్‌కార్ట్‌ ఉల్లంఘిస్తోందని  ఆమ్వే పేర్కొంది. 
డైరెక్ట్‌ విక్రయదారుల ప్రయోజనాలు, జీవనోపాధిని కాపాడటం, వ్యాపార ప్రాథమిక పునాదిని కాపాడుకోవడంతోపాటు  వినియోగదారుల భద్రతను కాపాడేందుకు  న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలని ఆమ్వే కోరింది.

గతంలో ఇదే వ్యవహారంలో ఆన్‌లైన్‌ ఫార్మా సంస్థ 1ఎంజీ.కామ్‌, స్నాప్‌డీల్‌లపై ఆమ్ వే కేసులు నమోదు చేయడంతో సదరు ఆమ్వే ఉత్పత్తులను తొలగించాయి. మరి తాజా పరిణామంపై ఫ్లిప్‌కార్ట్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios