భారతదేశ డైరీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అమూల్ వాణిజ్య ప్రకటనలతోనే ప్రజల దృష్టిని ఆకట్టుకుంటోంది. సృజనాత్మకత మేళవించి.. అత్యద్భుతంగా ప్రకటనలు రూపోందిస్తుంది అమూల్. తాజాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత, ద్రవిడ ఉద్యమనేత, తమిళ రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి మరణంతో ఆ రాష్ట్రం విషాదంలో మునిగిపోయింది. ఆయనకు ఘననివాళి ఆర్పించాలనుకున్న అమూల్.. ఓ స్కెచ్‌ను విడుదల చేసింది.

దీనిలో కరుణానిధి తన ఆటోమేటిక్ వీల్‌చైర్‌లో తమిళ సంప్రదాయ తెల్లని వస్త్రాలను ధరించి.. నల్లకల్లద్దాలు, మెడలో కండువాతో కూర్చొని ఉంటారు. ఆయనకు అమూల్ పాప షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. వాటితో పాటుగా ఆయనలోని రచయిత, స్క్రిప్ట్‌రైటర్‌కు సింబాలిక్‌గా వెనుక పుస్తకాలు, చేతిలో స్క్రిప్ట్ ప్యాడ్‌ను ఉంచి రాజకీయ భీష్ముడికి నివాళులర్పించింది. ‘‘ది తమిళ్ థలైవర్’’ పేరుతో విడుదలైన ఈ  ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.