అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో వివాదం రేగింది. ఓ ప్రొఫెసర్ హిందూ దేవతలు అత్యాచారం చేశారంటూ చెప్పడంతో అతనిపై విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మేనేజ్‌మెంట్ సైతం స్పందిస్తూ.. ప్రొఫెసర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 

మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు యూనివర్సిటీలోని మెడికల్ స్కూల్ ఫ్యాకల్టీ మెంబర్ డాక్టర్ జితేంద్ర కుమార్‌కు (Dr Jitendra Kumar) అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) (Aligarh Muslim University (AMU) షోకాజ్ నోటీసు (show-cause notice) జారీ చేసింది. ప్రొఫెసర్ క్లాస్‌లో భాగంగా ఒక స్లైడ్‌ షోను చూపించాడని, అందులో ఆయన "అత్యాచారానికి సంబంధించి పౌరాణిక ప్రస్తావన" తెచ్చాడని విద్యార్ధులు ఆరోపించారు.

భారత్‌లో అత్యాచారం, దాని చారిత్రక, మతపరమైన సూచనల గురించి ప్రొఫెసర్ బోధించారని వారు తెలిపారు. లెక్చర్ ఇస్తున్న సమయంలో స్లైడ్‌లో ‘‘బ్రహ్మ తన కూతురిపై అత్యాచారం చేసిన కథ’’ అంటూ చెప్పారని విద్యార్ధులు చెప్పారు. తన భార్యను మారువేషంలో అత్యాచారం చేసినందుకు ఇంద్రుడికి రుషి గౌతముడు శిక్ష వేయడం, జలంధరుడి భార్యపై శ్రీమహా విష్ణువు అత్యాచారం చేయడం గురించి ప్రొఫెసర్ వివరించాడు. అలాగే నిర్భయ అత్యాచారం, మధుర అత్యాచారం కేసు, హిందూ సంప్రదాయంలోని రకరకాల వివాహాల గురించి కూడా జితేంద్ర కుమార్ తెలిపినట్లు విద్యార్ధులు ఆరోపించారు. 

అయితే ఆయన లెక్చర్‌లో వున్న కంటెంట్‌ను ఖండిస్తూ పలువురు విద్యార్ధులు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో పోస్ట్‌లు పెట్టారు. ఇది వైరల్ కావడంతో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ అండ్ మెడిసిన్ ఫ్యాకల్టీ స్పందించింది. ఈ మేరకు డాక్టర్ జితేంద్ర కుమార్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సదరు స్లైడ్ .. విద్యార్ధులు, సిబ్బంది, ప్రజల మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని అలీఘర్ వర్సిటీ నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వివరణ ఇచ్చేందుకు డాక్టర్ జితేంద్ర కుమార్‌కు ప్రొఫెసర్‌కు 24 గంటల సమయం ఇచ్చారు. మరోసారి ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు గాను యూనివర్సిటీ యాజమాన్యం ఇద్దరు సభ్యులతో కూడిన విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ వ్యవహారంపై డాక్టర్ జితేంద్ర కుమార్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. 

ఇదిలావుండగా .. ఇటీవలే బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) ప్రొఫెసర్ ఒకరు రాముడి పెయింటింగ్‌పై తన ఫోటోను వుంచిన వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌లోని ఫోటో ఫ్రేమ్‌లో సీతాదేవి , రాముడితో పాటు లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్నారు. అయితే అందులో శ్రీరాముడి ముఖానికి బదులుగా బెనారస్‌ ఆర్ట్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అమ్రేష్‌ కుమార్(Amresk kumar)తన ఫోటోను వుంచాడు. అంతటితో ఆగకుండా సీతాదేవి ఫోటోలో ముఖాన్ని అమ్రేష్ తన భార్య ముఖంతో కూడిన ఫోటోని డిజైన్‌ చేసి ఉంచాడు.