రైలు ప్రమాదంలో భర్త ప్రాణాలు కోల్పోతే.. ఆయనకు భార్య వాట్సాప్ లో తుది వీడ్కోలు పలికింది. ఈ సంఘటన పాట్నాలో చోటుచేసుకుంది. ఇంతకీ మ్యాటరేంటంటే... పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో దసరా వేడుకల్లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం ఎందరి ప్రాణాలను బలిగొందో అందరికీ తెలిసిందే. రావణ దహన వేడుకను నిర్వహిస్తున్న సమయంలో రైలు ఒక్కసారిగా జనాల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో బిహార్‌కు చెందిన రాజేశ్‌ భగత్‌ అనే వ్యక్తి కూడా ఉన్నారు. రాజేశ్‌ది పేద కుటుంబం. ఏదో ఒక పనిచేస్తే కానీ పూట గడవని పరిస్థితి.

ఈ నేపథ్యంలో రాజేశ్‌ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి రూ.45,000 అవుతుందని అధికారులు తెలిపారు. అంత మొత్తం కట్టలేని పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక వాట్సాప్‌ ద్వారా తన భర్తకు తుది వీడ్కోలు చెప్పారు రాజేశ్‌ భార్య. పంజాబ్‌ ప్రభుత్వం కానీ బిహార్‌ ప్రభుత్వం కానీ తనపై దయ చూపి ఉంటే ఈపాటికి తన భర్తను ఆఖరిసారైనా చూసుకునేదాన్నని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.

ఇప్పుడు రాజేశ్‌ లేకపోవడంతో కుటుంబ బాధ్యత ఆమెపై పడింది. అందులోనూ ఆమె గర్భిణి. మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దాంతో తన పిల్లలను పోషించడానికి ఏదన్నా దారి చూపండంటూ అధికారులను వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఆర్థికంగా కొంత మొత్తాన్ని సాయం చేస్తామని గ్రామస్థులు ముందుకొచ్చారు.