విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆంఫన్ తుఫాను తాజాగా అతి తీవ్ర తుఫానుగా కొనసాగుతోంది. మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుఫాను క్రమంగా బలపడుతూ సూపర్ సైక్లోన్ మారుతోంది. ఒడిషాలోని పారాదీప్ కు దాదాపు దక్షిణంగా 600 కిలో మీటర్లదూరానా, పశ్చిమ బెంగాల్లోని దిఘాకు దక్షిణ నైరుతి దిశగా 750 కిలోమీటర్ల దూరానా కేంద్రీకృతమైంది. ఇది గంటకు 17 కిలోమీటర్లకు పైగా వేగాన్ని అందుకుంది. ఇది ఉత్తర ఈశాన్యంగా పయనించి రేపు సాయంత్రానికి బెంగాల్లోని సుందర్ బన్స్ సమీపాన తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తీరందాటే సమయానికి దీని ఉధృతి సూపర్ స్థాయినుంచి పెను తుపాను అంటే అతి తీవ్ర తుపాను స్థితికి చేరుతుంది. ప్రస్తుతం 275 కిలోమీటర్ల ప్రళయ భయంకరంగా ఉన్న తుపాను గాలులు తీరందాటే సమయానికి 200 కిలోమీటర్ల వేగానికి తగ్గుతాయి.

ఇప్పటికే 75 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. ఈరోజు బెంగాల్లో ఓ మాదిరి వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల మాత్రం అతిభారీ వర్షాలు కురుస్తాయని.. నేటి సాయంత్రం నుంచీ బెంగాల్లోని గంగా ప్రవాహ ప్రాంతాల్లో కుంభవృష్టి తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఒడిషాలోని గజపతి, గంజాం, పూరీ, జగత్సింగ్ పూర్, కేంద్రపారా జిల్లాలు ఇప్పటికే ఈ తుపాను ధాటికి గురయ్యాయి. పదిలక్షల మంది తీరప్రాంత వాసులను ఒడిషా సర్కారు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డిఆర్‌ఎఫ్ సహకారంతో సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ రోజు ఒడిషాలోని భద్రక్, బాలాసోర్, మయూర్భంజ్, జైపూర్, కేంద్రపారా, కేంజార్ జిల్లాల మీద కూడా సూపర్ సైక్లోన్ ప్రభావం తీవ్రంగా పడనున్నది.