ఆ అంత్యక్రియల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు చేసిన పని అందరినీ విస్మయానికి గురిచేసింది.

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ అనారోగ్యంతో బాధపడుతూ.. గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. శుక్రవారం ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. ఆ అంత్యక్రియల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు చేసిన పని అందరినీ విస్మయానికి గురిచేసింది.

వాజ్ పేయి అభిమానులకు అయితే.. అమిత్ షాపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతలా అందరికీ కోపం తెప్పించే పని ఆయన ఏం చేశారంటే... వాజ్‌పేయి అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు ముందు వరుసలో కూర్చున్నారు. వారిలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ తదితరులు వీరంతా వాజ్‌పేయికి చివ‌రిసారిగా నివాళులు అర్పించి విష‌న్న‌వ‌దనాలతో కూర్చున్నారు. 

అయితే వారంతా మర్యాదపూర్వకంగా కూర్చున్నా.. అమిత్ షా మాత్రం కాలుపై కాలు వేసుకొని కూర్చుని తన పాదం అద్వానీని తాకినంత సమీపంలో పెట్టి, గంటల తరబడి అదే భంగిమలో కూర్చున్నాడు. మరోసారి మోదీవైపు కూాడా అలాగే కూర్చున్నాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు అమిత్‌షాపై దుమ్మెత్తిపోస్తున్నారు. కొన్ని ఛానల్స్ కూడా, ఈ విషయం చూపించటంతో, అమిత్ షా తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. 

ఓ మాజీ ప్రధానికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియలను కోట్లాదిమంది వీక్షిస్తున్నారన్న విషయాన్ని మరిచి ఇలా ఎలా ప్రవర్తిస్తారంటూ నిలదీస్తున్నారు. భూటాన్ రాజు సహా వివిధ దేశాల మంత్రుల ఎదుట ఇలా వ్యవహరించి వాజ్‌పేయిని అవమానించారంటూ నెట్టింట అమిత్ షాపై మండిపడుతున్నారు.