న్యూఢిల్లీ: వచ్చే లోకసభ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా యోగా గురు రామ్ దేవ్ బాబాను కోరారు. సంపర్క్ ఫర్ సమర్థన్ ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం బాబా రామ్ దేవ్ ను కలిశారు. 

మద్దతు కోసం తాను రామ్ దేవ్ వద్దకు వచ్చినట్లు అమిత్ షా తెలిపారు. తాను చెప్పిందంతా బాబా రామ్ దేవ్ సహనంతో విన్నారని, తమ పనికి సంబంధించిన సాహిత్యాన్ని ఆయనకు ఇచ్చానని అమిత్ షా చెప్పారు .

తమకు బాబా రామ్ దేవ్ మద్దతు లభిస్తే కోట్లాది ఆయన అనుచరులు తమకు అండగా నిలుస్తారని చెప్పారు. సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమంలో భగాంగా తాను, తమ పార్టీ నాయకులు 50 మందికి పైగా పెద్దలను కలుస్తారని, వారంతా గతంలో తమకు మద్దతు ఇచ్చినవారేనని, వారికి తమ రిపోర్టు కార్డు ఇస్తామని అన్నారు. 

2014 ఎన్నికల్లో తమతో ఉన్నవారి ఆశీస్సులను కోరుతున్నట్లు షా తెలిపారు. తాము కనీసం లక్ష మందిని కలుసుకుంటామని, కోటి కుటుంబాలకు చేరుకుంటామని ఆయన చెప్పారు. 

అమిత్ షా ఇప్పటికే మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ దల్బరీ సుహాగ్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ లను కలిశారు. అమిత్ షా పక్కన నించుని రామ్ దేవ్ బాబా మోడీ నాలుగేళ్ల పాలనపై ప్రశంసల జల్లు కురిపించారు.