ఏషియనెట్ న్యూస్ నెట్‌వర్క్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో కర్ణాటక ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇమేజ్ లేదని, అలాంటి పార్టీ ప్రకటించే హామీలను ఎవరు విశ్వసిస్తారని ప్రశ్నించారు. 

బెంగళూరు: ఎన్నికల సమయంలో ఉచితాలు, తాయిలాలు ప్రకటించడాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ వంటి ప్రశస్తి లేని పార్టీలు ఇచ్చే హామీలను ఎవరూ నమ్మరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. వారు (కాంగ్రెస్) గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అసోం, మణిపూర్, త్రిపురలలోనూ ఇలాంటి హామీల ప్రకటించారని గుర్తు చేశారు. అవి ఇప్పుడు కర్ణాటకలో ప్రకటిస్తున్నవాటికంటే మెరుగ్గా ఉన్నాయని వివరించారు. ఆ పార్టీకి ఒక ఇమేజే లేదని, కాబట్టి, వారి హామీలను ఎవరు నమ్ముతారు? అంటూ ప్రశ్నించారు.

ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా కీలక విషయాలు తెలిపారు. నెలవారీగా రూ. 2000 పంపిణీ లేదా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి కాంగ్రెస్ హామీలు బీజేపీకి నష్టాన్ని చేకూర్చడం లేదా అని ప్రశ్నించగా.. కచ్చితంగా నష్టపరచవని ఆయన అన్నారు. ‘ఎందుకంటే ప్రజలు రూ. ఒక లక్ష విలువైన టాయిలెట్లు పొందారు. వారు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పొందారు. కనెక్షన్లు కూడా ఉచితంగానే లభించాయి. వారు ఉండటానికి ఇళ్లు కూడా పొందారు. ఉచితంగా ఆహార ధాన్యాలు పొందుతున్నారు. రైతులు కూడా రూ. 10 వేలు పొందుతున్నారు. ప్రజలు వీటిని అడ్వాన్స్‌గా పొందుతున్నారు’ అని అమిత్ షా తెలిపారు.

ఇవన్నీ ముగిసిపోతాయని వోటర్లకు తెలుసు అని, వారిచ్చే రూ. 2000 తీసుకుని ఏం సాధిస్తారు? అనే ప్రశ్నకు సమాధానం కూడా వారికి తెలుసు అని అమిత్ షా అన్నారు. ఇది అసలే డిబేట్ పాయింటే కాదని కొట్టిపారేశారు. పేదలు అర్థం చేసుకుంటారని, ఎందుకంటే మోడీ ప్రభుత్వ పథకాల లబ్దిదారులు వీరే కాబట్టి అని వివరించారు.

కర్ణాటక ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ ఉచితాలు ప్రకటిస్తున్న తరుణంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 1 కోటి, కళ్యాణ కర్ణాటక రీజియన్‌కు రూ. 5 వేల కోట్లు అందిస్తామని కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, మహిళపై ఆధారపడిన కుటుంబానికి నెలకు రూ. 2 వేలు, నిరుద్యోగ డిప్లోమా హోల్డర్లకు రూ. 1,500 భృతి, డిగ్రీ పట్టాదారులకు రూ. 3,000 (రెండేళ్లపాటు), ప్రజా రవాణాలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీలు గుమ్మరించింది.

తాయిలాల సంస్కృతిని ప్రధాని మోడీ కూడా గత వారం విమర్శించారు. కాంగ్రెస్‌కు వారంటీ లేకుండా పోయినాక.. ఆ పార్టీ ఇచ్చే గ్యారంటీలకు అర్థమే లేదని అన్నారు.