సారాంశం

Amit Shah: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజస్థాన్ లో తన మొదటి ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీని ఉద్దేశించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, బుజ్జగింపు రాజకీయాలు, ఉదయ్ పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్య, అలాగే అవినీతి ఆరోపణలు వంటి అంశాలను లేవ‌నెత్తుతూ కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు.
 

Rajasthan Election 2023: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పెను ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు. ఆయ‌న ప్రయాణిస్తున్న ఎన్నిక‌ల ప్ర‌చార‌ రథం రాజస్థాన్ లోని నాగౌర్ లో విద్యుత్ తీగను తాకడంతో తృటిలో ప్ర‌మాదం నుంచి తప్పించుకున్నారు. ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు అమిత్ షా బృందం బిడియాడ్ గ్రామం నుంచి పర్బత్‌సర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పర్బత్‌సర్ లో ఇరువైపులా దుకాణాలు, ఇళ్లు ఉన్న సందు గుండా వెళ్తుండగా ఆయన రథం (ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనం) పైభాగం విద్యుత్ లైన్ ను తాకడంతో మంటలు చెలరేగి వైర్ తెగిపోయింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్ లైన్ లో వైర‌ల్ గా మారింది. ఈ ఘటనపై విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. షా రథం వెనుక ఉన్న ఇతర వాహనాలు వెంటనే ఆగిపోవ‌డం, విద్యుత్ సరఫరా నిలిచిపోవ‌డంతో ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. అమిత్ షాను మరో వాహనంలో అక్క‌డి నుంచి పర్బత్‌సర్ ర్యాలీకి వెళ్లారు. కాగా, నవంబర్ 25న జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంగ‌ళ‌వారం కుచమన్, మక్రానా, నాగౌర్ లలో మూడు ర్యాలీల్లో అమిత్ షా ప్రసంగించారు.