న్యూఢిల్లీ: తన ప్రకటనపై మజ్లీస్ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ చురకలు అంటించిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆయనను మందలించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ను ఉగ్రవాదులకు సేఫ్ జోన్‌గా మారిందనే కిషన్ రెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో హోం శాఖ మంత్రిగా శనివారంనాడే బాధ్యతలు చేపట్టిన అమిత్‌షా కిషన్ రెడ్డిని మందలించినట్లు సమాచారం.  
 
దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా మూలాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బెంగళూరు, భోపాల్ సహా ఎక్కడ ఉగ్ర ఘటనలు జరిగినా మూలాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయని, హైదరాబాద్‌లో ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి ఉగ్రవాదులను రాష్ట్ర పోలీసులు, ఎన్ఐఏ అరెస్టు చేస్తున్నారని చెప్పారు.
 
కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై అసదుద్దిన్ ఓవైసీ ఒవైసీ మండిపడ్డారు. బాధ్యతగల మంత్రి ఇంత బాధ్యతారహితంగా మాట్లడటం ఏమిటని ప్రశ్నించారు. ఉగ్రవాదానికి హైదరాబాద్ సేఫ్ జోన్ అని ఎన్ఐఏ, ఐబీ, రా ఎన్నిసార్లు లిఖిత పూర్వకంగా చెప్పాయని ఆయన కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. 

తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధికి వ్యతిరేకిగా కిషన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లుగా హిందూ, ముస్లిం పండుగలు, ఊరేగింపులు ఎంతో ప్రశాంతంగా జరుగుతున్న విషయం కిషన్‌రెడ్డికి తెలియదా అని ఓవైసీ అడిగారు.