న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పంజాబ్ శానససభ ఎన్నికల్లో కాంగ్రెసు కోసం పనిచేయనున్నారు పంజాబ్ శాసనసభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న సమయంలో ఆ దిశగా కాంగ్రెసు పార్టీ అడుగులు వెస్తోంది. ప్రశాంత్ కిశోర్ ను ఎన్నికల సలహాదారుడిగా నియమించుకోవాలని చూస్తోంది. 

అందుకు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రశాంత్ కిశోర్ తో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. మేనిఫెస్టో రూపకల్పన, అభ్యర్థుల ఎంపిక, పథకాల రూపకల్పన వంటి అంశాలపై చర్చించాలని భావిస్తున్నారు. పంజాబ్ లో మొత్తం 117 శాసనసభా స్థానాలున్నాయి. పంజాబ్ శాసనసభ గడువు మరో 15 నెలలు ఉంది.

బిజెపితో కొనసాగుతూ వచ్చిన అకాలీదళ్ బిజెపితో తెగదెంపులు తీసుకుంది. దీంతో సుఖ్ బీర్ సింగ్ ను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెసు భావిస్తోంది. ఇందుకు ప్రశాంత్ కిశోర్ సేవలు పనికి వస్తాయని అనుకుంటున్నారు. 

2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ విజయానికి ప్రశాంత్ కిశోర్ పనిచేశారు. ఫలితాలను పునరావృతం చేయాలని భావిస్తున్న అమరీందర్ సింగ్ ప్రశాంత్ కిశోర్ తో ఒప్పందం చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రశాంత్ కిశోర్ కూడా సానుకూలంగా ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. 

తమిళనాడులోని డీఎంకె అధినేత స్టాలిన్ తో కలిసి పనిచేసేందుకు ప్రశాంత్ కిశోర్ ఒప్పందం చేసుకున్నారు. త్వరలో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మమతా బెనర్జీతో కలిసి ఆయన పనిచేస్తున్నారు