ప్రస్తుతం కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. దీంతో లాక్ డౌన్ విధించారు. ఈ లాక్ డౌన్ కారణంగా చాలా మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. కొందరు మాత్రం ఏది ఏమైనా పెళ్లి మాత్రం చేసుకుంటున్నారు. అయితే.. బంధువులు ఎవరూ లేకుండా ఏదో అలా కానిస్తున్నారు. అయితే.. తాజాగా ఓ జంట ఏకంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న హాట్ స్పాట్ ఏరియాలో పెళ్లి చేసుకున్నారు.  ఈ సంఘటన యూపీలోని ఆగ్రాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గౌతమ్‌నగర్‌లో ఉంటున్న‌ దినేష్ చంద్ కుమార్తె రీమాకు ఆరు నెలల క్రిత‌మే శంభునగర్‌లో నివసిస్తున్న మోహన్ సింగ్ కుమారుడు యోగేశ్‌తో వివాహం నిశ్చ‌య‌మయ్యింది. మే 4న వివాహం చేయాల‌ని నిర్ణ‌యించారు. కరోనా కారణంగా వివాహం ఘ‌నంగా చేసుకునే ప‌రిస్థితులు లేవు. దీంతో పెళ్లి వాయిదా వేసుకోవాల‌ని ఇరు వర్గాలవారు భావించారు. అయితే వ‌రుడు అనుకున్న‌స‌మ‌యానికే వివాహం చేసుకోవాల‌నుకున్నాడు. దీంతో వ‌రుడు తన తండ్రితో పాటు పెళ్లి కుమార్తె ఇంటికి చేరుకున్నాడు. వ‌ధూవ‌రులు పెళ్లి దుస్తులు ధ‌రించి, లాక్ డౌన్ నిబంధ‌న‌లతోపాటు, సామాజిక దూరాన్ని పాటిస్తూ వివాహం చేసుకున్నారు.