ఉత్తరప్రదేశ్: ఎన్నికల ప్రచారంలో విమర్శలు కోటలు దాటుతున్నాయి. ఆకాశమే హద్దుగా అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలకు దిగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

రాజీవ్ గాంధీ అత్యంత అవినీతి పరుడు అంటూ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ గట్టిగానే సమధానం చెప్పింది. ఇదిలా ఉంటే రాజీవ్ గాంధీపై ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని స్పష్టం చేస్తూ ఉత్తరప్రదేశ్‌లోని అమేథికి చెందిన ఓ వ్యక్తి రక్తంతో లేఖ రాసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. 

అమేథిలోని షాగర్‌కు చెందిన మనోజ్ కశ్యప్ మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు తాను మనస్తాపం చెందానని అందువల్లే ఈ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నాడు. మోదీ వ్యాఖ్యలు తమ ప్రాంత ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని లేఖలో పేర్కొన్నారు. తనను ఎంతో బాధించాయని చెప్పుకొచ్చారు. 

18 ఏళ్లకే ఓటు హక్కు, పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు, దేశంలో కంప్యూటర్ విప్లవానికి నాంది పలికిన వ్యక్తి రాజీవ్‌గాంధీ అంటూ ప్రశంసించారు. దివంగత మాజీ ప్రధాని వాజపేయి సైతం రాజీవ్‌ను మెచ్చుకున్న అంశాన్ని సైతం లేఖలో పొందుపరిచాడు మనోజ్ కశ్యప్. 

రాజీవ్‌గాంధీని అవమానించే ఎవరినైనాసరే ఈ ప్రాంత ప్రజలు రాజీవ్‌ను హతమార్చిన వారిని చూసిన మాదిరిగానే చూస్తారంటూ లేఖలో స్పష్టం చేశారు. దేశ ప్రజలు అదేవిధంగా అమేథి ప్రజల గుండెల్లో రాజీవ్ ఇంకా జీవించే ఉన్నారని చెప్పుకొచ్చారు. 

ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యకుండా ప్రధాని నరేంద్దరమోదీకి ఆదేశాలు జారీ చెయ్యాలంటూ లేఖలో కోరాడు. మనోజ్ కశ్యప్ లేఖను కాంగ్రెస్ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేయడంతో ఈ వార్త కాస్త వెలుగులోకి వచ్చింది.