అమెరికాలో భారత సంతతి మరో ఘనత సాధించారు. నెదర్లాండ్స్ దేశానికి అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన షెఫాలి రజ్దాన్ దుగ్గల్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. జమ్ము కశ్మీర్ నుంచి అమెరికా వలస వెళ్లిన 50 ఏళ్ల షెఫాలి రజ్దాన్ దుగ్గల్ రాజకీయ కార్యకర్త, హక్కుల కార్యకర్తగా పేరుపొందారు. 

న్యూఢిల్లీ: అమెరికాలో భారత సంతతి మరో ఘనత సాధించారు. నెదర్లాండ్స్ దేశానికి అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన రాజకీయ కార్యకర్త షెఫాలి రజ్దాన్ దుగ్గల్‌ను ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. ఈ విషయాన్ని శ్వేత సౌధం శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. షెఫాలి రజ్దాన్ దుగ్గల్ జమ్ము కశ్మీర్‌కు చెందిన మహిళ. 50 ఏళ్ల షెఫాలి రజ్దాన్ దుగ్గల్ అమెరికాకు వలస వెళ్లారు. ఆమె సిన్‌సినాటి, షికాగో, న్యూ యార్క్, బోస్టన్‌లలో పెరిగారు.

షెఫాలి రజ్దాన్ దుగ్గల్ రాజకీయ కార్యకర్త. మహిళా హక్కులు, మానవ హక్కుల కోసం పోరాడారని వైట్ హౌజ్ వెల్లడించారు. ఆమె యూఎస్ హోలోకాస్ట్ మెమోరియల్ మ్యూజియం కౌన్సిల్‌కు ప్రెసిడెన్షియల్ అపాయింటీగా పని చేశారు. వెస్ట్రన్ రీజినల్ అడ్వైజర్‌గా సేవలు అందిస్తున్నారు. మానవ హక్కుల సంఘానికి శాన్‌ఫ్రాన్సిస్కో కమిటీ సభ్యులుగా ఉన్నారు. వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ లీడర్షిప్, క్యారెక్టర్ కౌన్సిల్‌లోనూ సభ్యులుగా ఉన్నారు. ఎమిలీ లిస్ట్ నేషనల్ డైరెక్టర్ల బోర్డులోనూ సేవలు అందించారు.

న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ కమ్యూనికేషన్‌లో పీజీ పట్టా పొందారు. మయామీ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ చదివారు. ఆమె పలు పౌర పురస్కారాలు అందుకున్నారు. కాలిఫోర్నియాలో అత్యంత శక్తిమంతమైన మహిళగా నేషనల్ డైవర్సిటీ కౌన్సిల్‌ ప్రకటించింది. జో బైడెన్‌కు నేషనల్ కో చైర్‌గానూ సేవలు అందించారు. డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి డిప్యూటీ నేషనల్ ఫైనాన్స్ చైర్‌గానూ కొనసాగారని వైట్ హౌజ్ వెల్లడించింది.

అంతేకాదు, ఆమె బరాక్ ఒబామా హయాంలోనూ చురుకుగానే పలు కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా 2008లో బరాక్ ఒబామా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. హిల్లరీ క్లింటన్ అధ్యక్ష ప్రచారంలోనూ భాగస్వామ్యం పంచుకున్నారు.

ఇదిలా ఉండగా, అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారతీయ సంతతికి చెందిన ప్రొఫెసర్ నీలి బెండపూడి నియమితులయ్యారు. దీంతో ఈ పదవి చేపట్టబోతున్న తొలి మహిళ, శ్వేతజాతీయేతరాలుగా ఆమె చరిత్రకెక్కారు. ఈ మేరకు డిసెంబర్‌లో యూనివర్శిటీ ఆమె నియామకాన్ని ధృవీకరించింది. 

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన బెండపూడి.. ఉన్నత విద్య కోసం 1986లో అమెరికాకు వెళ్లారు. అనంతరం అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె లూయిస్ విల్లే యూనివర్శిటీలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గాను, వర్శిటీ అధ్యక్షురాలిగాను కొనసాగుతున్నారు. ఈ క్రమంలో పెన్సిల్వేనియా స్టేట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ డిసెంబర్ 9న ఆమెను వర్శిటీ తదుపరి అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం జరిగింది. 2022లో ఆమె ఈ పదవి చేపట్టనున్నారు. ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల బెండపూడి ఆనందం వ్యక్తం చేశారు.

పెన్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నీలి బెండపూడిని తదుపరి అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా పేర్కొన్నట్లు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు ఆమె అకాడమీలో దాదాపు 30 సంవత్సరాలుగా మార్కెటింగ్‌ విభాగంలో బోధించడమే కాక కాన్సాస్ విశ్వవిద్యాలయంలో అత్యున్నత అధికారిగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్‌గా, యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్‌లో స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్‌గా, ఓహియో స్టేట్ యూనివర్శిటీలో ఇనిషియేటివ్ ఫర్ మేనేజింగ్ సర్వీసెస్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా సేవలందించారు. పైగా ఆమె తన వృత్తిని విద్యార్థుల విజయానికి అంకితం చేసింది.