ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి బెదిరింపు కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.  

ముఖేష్ అంబానీ ఇంటి ముందు స్కార్పియో వాహనంలో పేలుడు పదార్దాలు ఉంచారు. అయితే ఈ వాహన యజమాని మన్‌సుఖ్ హిరెన్ మరణించాడు. ఈ కేసులో అసిస్టెంట్ ఇన్స్ పెక్టర్ సచిన్ వాజేను ఎన్ఐఏ అనుమానితుడిగా అదుపులోకి తీసుకొంది.ఈ వాహనాన్ని వాజే  ఉపయోగిస్తున్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. ఈ వాహనాన్ని ఎన్ఐఏ తమ ఆధీనంలోకి తీసుకొంది.

ఈ కారు మనీషా భవేవ్వర్ పేరుతో రిజిష్టరై ఉంది. ఇదే కారులో ప్రతి రోజూ సచిన్ వాజే విధులకు హాజరయ్యేవాడు.పోలీస్ ప్రధాన కార్యాలయంలోని క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్ లో సోమవారంనాడు  పోలీసులు సోదాలు నిర్వహించారు. 

సీపీయూ తో పాటు వాజే ఉపయోగించే ఐపాడ్  కొన్ని పత్రాలను పోలీసులు స్వాధీనం  చేసుకొన్నారు. దీంతో వాడుతున్న ఓ కారు నుండి రూ. 5 లక్షల నగదు, నగదు లెక్కించే యంత్రాన్ని, కొన్ని దుస్తులను స్వాధీనం చేసుకొన్నారు.

ఫిబ్రవరి 17న మన్‌సుఖ్ హిరేన్ కూడ ఈ బెంజ్ కారును ఉపయోగించినట్టుగా థానేలోని ఓ బీజేపీ నేత ట్విట్టర్ లో పోస్టు చేశారు.

సచిన్ వాజే తన ఇంటికి ఉన్న సీసీ కెమెరాల డిజిటల్ వీడియో రికార్డర్లను ఇతర అధికారులకు చెప్పి తెప్పించుకొన్నాడు. ఇప్పుడు సీఐయూ ఆఫీసులో ఉన్న వాటిని ఎన్ఐఏ పరిశీలించింది. రికార్డైన కొన్ని దృశ్యాలను తొలగించినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఫిబ్రవరి 25 అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల వాహనం వెలుగులోకి వచ్చిన రెండు రోజులకే వాజే తన ఇంటి నుండి ఈ సీసీపుటేజీని తెప్పించుకొన్నట్టుగా గుర్తించారు.

సచిన్ వాజేనే స్వయంగా స్కార్పియో కారును అంబానీ ఇంటి వద్ద వదిలేసి క్రిమినల్ ఇంటలిజెన్స్ యూనిట్ కు చెందిన ఇన్నోవా వాహనంలో వెళ్లినట్టుగా ప్రాథమిక ఆధారాలున్నాయని ఎన్ఐఏ శుక్రవారం నాడు కోర్టుకు తెలిపింది.

తమ వద్ద ఉన్న ఓ పుటేజీలో పీపీఈ కిట్ ధరించి ఇన్నోవాలో నుండి దిగి స్కార్పియో వైపు వెళ్తున్న వ్యక్తి వాజే అని ఎన్ఐఏ అనుమానిస్తోంది. 

దీంతో అతనికి పీపీఈ కిట్ వేసి సీన్ రీ క్రియేట్ చేయాలని పోలీసులు సన్నాహలు చేస్తున్నారు.