జూన్ 30వ తేదీ నుంచి అమర్‌నాథ్ యాత్రను నిర్వహించనున్నట్టు జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు. ఈ యాత్ర 43 రోజులపాటు సాగుతుందని, రక్షా బంధన్ రోజున ముగుస్తుందని వివరించారు. అన్ని కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ యాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు.
న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్రపై అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. జూన్ 30వ తేదీ నుంచి అమర్‌నాథ్ యాత్ర నిర్వహించనున్నట్టు జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు. ఈ యాత్ర 43 రోజుల పాటు సాగనున్నట్టు తెలిపారు. శ్రీ అమర్‌నాథ్ దేవస్థానం బోర్డుతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. ప్రతి యేడాది అమర్‌నాథ్ యాత్ర నిర్వహిస్తుండేవారు. కానీ, జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే అధికరణాలను తొలగించిన 2019లో ఈ యాత్రను అర్ధంతరంగా ముగించారు. ఆ తర్వాత కూడా కరోనా కారణంగా ఈ యాత్రను నిర్వహించలేదు. కేవలం సింబాలిక్‌గా పాటించారు.
జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ రోజు ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. శ్రీ అమర్‌నాథ్‌జీ ష్రైన్ బోర్డు సమావేశాన్ని ఈ రోజు నిర్వహించామని తెలిపారు. అన్ని కరోనా నిబంధనలతో 43 రోజులపాటు సాగే ఈ అమర్‌నాథ్ యాత్రను జూన్ 30 నుంచి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఎప్పట్లాగే సాంప్రదాయంగా ప్రకారం రాఖీ పౌర్ణమి రోజున ఈ యాత్ర ముగుస్తుందని పేర్కొన్నారు. ఈ యాత్ర గురించిన ఇతర అంశాలపై లోతుగా చర్చించామని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది.
శ్రీ అమర్‌నాథ్‌జీ దేవస్థానం బోర్డు 2000లో ఏర్పాటు చేశారు. ఈ బోర్డుకు జమ్ము కశ్మీర్ గవర్నర్ ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా ఉన్నారు. లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. కఠోర శీతోష్ణస్థితుల మధ్య వారు తమ యాత్రను చేపడతారు. దక్షిణ కశ్మీర్‌లోని అమర్‌నాథ్ ఆలయాన్ని చేరుకుని అక్కడ మంచుతో నిర్మితమైన లింగాన్ని దర్శించుకుంటారు. శివునికి తమ మొక్కులు అప్పజెప్పి వెనుదిరుగుతారు.
