Amarnath Yatra 2022: ఈ నెల 11 నుంచి రిజిస్ట్రేషన్.. ఈ బ్యాంకుల్లో మాత్రమే
ప్రతిష్టాత్మక అమర్‌నాథ్ యాత్రకు సంబంధించి ఈ నెల 11 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని అమర్‌నాథ్ జీ శ్రైన్ బోర్డ్ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్ బ్యాంక్, పీఎన్‌బీ , యెస్ బ్యాంకులకు చెందిన సుమారు 446 బ్రాంచీల్లో, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 100 బ్రాంచీల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది.
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే.. ప్రఖ్యాత అమరనాథ్ యాత్ర (amarnath yatra) కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ (amarnath yatra 2022 registration) ఈ నెల 11 నుంచి ప్రారంభం కానుందని అమర్‌నాథ్‌జీ శ్రైన్ బోర్డ్ (Shri Amarnath Ji Shrine Board) సీఈవో నితీశ్వర్ కుమార్ వెల్లడించారు. జూన్ 30 నుంచి ఆగస్టు 11 వరకు ఈ యాత్ర కొనసాగుతుందని ఆయన చెప్పారు.
కొవిడ్-19 తర్వాత ప్రారంభం ప్రారంభం కానున్న ఈ యాత్రకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు నితీశ్వర్ తెలిపారు. జమ్మూలోని రాంబన్ నుంచి ప్రారంభంకానున్న ఈ యాత్రకు దాదాపు మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. జమ్మూ కశ్మీర్ బ్యాంక్, పీఎన్‌బీ , యెస్ బ్యాంకులకు చెందిన సుమారు 446 బ్రాంచీల్లో, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 100 బ్రాంచీల్లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించినట్లు నితీశ్వర్ కుమార్ పేర్కొన్నారు.
కాగా.. శ్రీ అమర్‌నాథ్‌జీ దేవస్థానం బోర్డు 2000లో ఏర్పాటు చేశారు. ఈ బోర్డుకు జమ్ము కశ్మీర్ గవర్నర్ ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా ఉన్నారు. లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. కఠోర శీతోష్ణస్థితుల మధ్య వారు తమ యాత్రను చేపడతారు. దక్షిణ కశ్మీర్‌లోని అమర్‌నాథ్ ఆలయాన్ని చేరుకుని అక్కడ మంచుతో నిర్మితమైన లింగాన్ని దర్శించుకుంటారు. శివునికి తమ మొక్కులు అప్పజెప్పి వెనుదిరుగుతారు. ప్రతి ఏడాది అమర్‌నాథ్ యాత్ర నిర్వహిస్తారు. కానీ, జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే అధికరణాలను తొలగించిన 2019లో ఈ యాత్రను అర్ధాంతరంగా ముగించారు. ఆ తర్వాత కరోనా (coronavirus) కారణంగా ఈ యాత్రకు ప్రభుత్వం అనుమతించలేదు.